RRR: ఆర్ ఆర్ ఆర్ హీరోలు సంక్రాంతి సంబరాలు అమెరికాలో జరుగుతున్నాయి. అంతర్జాతీయ సినిమా వేదికలపై కనిపిస్తూ, మాట్లాడుతూ, గౌరవాలు అందుకుంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ పండగ చేసుకుంటున్నారు. కాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాగా భారత్ తరపున ఆర్ ఆర్ ఆర్ ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపే విషయంలో రాజకీయాలు జరిగాయని మీరు భావిస్తున్నారా? అని అడగ్గా… తారక్ తన అభిప్రాయం వెల్లడించారు.

రాజకీయ కుట్రలో భాగంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అధికారికంగా ఇండియా తరపున నామినేషన్స్ కి పంపలేదనేది నేను నమ్మను. ఎందుకంటే జ్యూరీ సభ్యులకు ఏ సినిమాను పంపాలో తెలుసు. వారికి అనుభవం, అవగాహన ఉన్నాయి. ఇక భారత్ తరపున ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అధికారిక ఎంట్రీ ఎందుకు దొరకలేదు అనే విషయంపై నేను మాట్లాడను. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ మమ్మల్ని గర్వపడేలా చేసింది. మేము ఆ గౌరవాన్ని ఆస్వాదిస్తున్నాము, అని చెప్పుకొచ్చారు.
ప్రతి ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీ అవార్డ్ నామినేషన్స్ కి ఇండియా తరపున సినిమాలను ఎంపిక చేసి పంపుతారు. ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ కి ఆ అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. అనూహ్యంగా గుజరాతీ భాషకు చెందిన ఛలో షో (ది లాస్ట్ ఫిల్మ్ షో)ని పంపారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని అర్హతలున్న ఆర్ ఆర్ ఆర్ కాదని చెల్లో షో చిత్రాన్ని పంపడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ యూనిట్ మాత్రం ఏనాడూ ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదు. మూవీపై నమ్మకంతో ఆస్కార్ ఎంట్రీకి ఉన్న మార్గాలు వెతికారు.

లాస్ ఏంజెల్స్ నగరంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రెండు వారాలకు పైగా ప్రదర్శించబడిన ఏ చిత్రమైనా జనరల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలా 15 విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేశారు. ప్రస్తుతం ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఓటింగ్ జరుగుతుండగా జనవరి 17 తర్వాత ఫలితం తెలియనుంది. ప్రతి విభాగంలో నామినేట్ అయిన 5 చిత్రాలను జ్యూరీ మెంబర్స్ ప్రకటిస్తారు.