PMJAY – Ayushman Bharat: కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం 2018 సెప్టెంబర్ 23న ఆరోగ్య బీమా పథకం ప్రారంభించింది. దేశంలోని 50 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా దీన్ని రూపకల్పన చేశారు. దేశ వ్యాప్తంగా పది కోట్ల మందికి ఈ కార్డులు జారీ అయ్యాయి. దీనికి జాతీయ ఆరోగ్య రక్షణ పథకంగా నామకరణం చేశారు. తరువాత దీన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనగా మార్చడం జరిగింది. ఆర్థికంగా నిరుపేదలైన వారికి ఏ ఖర్చు లేకుండా రూ. 5 లక్షల వరకు ప్రభుత్వమే భరించే ఈ పథకం పేదవారికి తోడ్పాటు అందించేదిగా ఉంటుందనడంలో సందేహం లేదు.

పీఎంజేఏవై పథకం కింద ఆస్పత్రిలో చేరే రోగికి పదిహేను రోజుల వరకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఇందులో 1400 రకాల జబ్బులకు వైద్యం అందుతుంది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారే అర్హులు. ఈ పథకం కింద పది లక్షల లబ్ధిదారుల్లో ఎనిమిది లక్షల మంది గ్రామీణ, రెండు లక్షల మంది పట్టణ ప్రాంతాల్లోని వారికి లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద చేరే వారికి ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అందజేస్తుంది. పేరు నమోదు చేసుకునే వారిలో ఇల్లులేని వారు, రోజు కూలీ చేసుకునే వారు. ఏ పని చేయలేని వృద్ధులు, ఒకే గదిలో ఉంటున్న వారు, పారిశుధ్య పనులు చేసే కుటుంబాలు దీనికి అర్హులుగా చెబుతున్నారు.

పీఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు కార్డు, వయసు, ఆధార్, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, అడ్రస్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం తదితర సర్టిఫికెట్లు ఉంటే చాలు. పీఎంజేఏవై అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి హాస్పిటల్ సెక్షన్లో రాష్ర్టం, జిల్లాపై క్లిక్ చేయాలి. మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోవాలి. క్యాప్సా కోడ్ ఎంటర్ చేసుకోవాలి తరువాత సెర్చ్ లో క్లిక్ చేయాలి. ఈ పథకంతో పేదలకు నిజంగా మేలు జరుగుతుంది. రూ. 5 లక్షల వరకు ఆస్పత్రిలో అయ్యే ఖర్చును కేంద్రమే భరించడం గమనార్హం.
కేంద్రం తీసుకొచ్చిన పథకాలపై ప్రచారం కరువవుతోంది. దీంతోనే ప్రజలకు తెలియకుండా పోతోంది. దీని కారణంగా చాలా మంది పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇంకా కేంద్రం తెచ్చిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపణలున్న సంగతి అందరికి విధితమే. పీఎంజేఏవై పథకం గురించి ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యం కలిగించి వారిని జబ్బుల నుంచి దూరం చేసేందుకు నేతలు ప్రయత్నించాలి. ప్రజలకు కలిగే బాధల నుంచి విముక్తులను చేసే పనికి అందరు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.