Ram Charan: నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి పై ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ అప్ కమింగ్ చిత్రం లో ఓ పాత్ర కోసం ఆయన్ని సంప్రదించగా తిరస్కరించారట. పెద్దగా ఆఫర్స్ లేని ఆర్ నారాయణ మూర్తి ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయను అన్నారనే సందిగ్ధత మొదలైంది. వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. రామ్ చరణ్ 16వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది.
ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. అందుకే ఆ ప్రాంతానికి చెందిన నటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఆర్ నారాయణ మూర్తిని దర్శకుడు బుచ్చిబాబు సంప్రదించారట. అయితే ఆర్ నారాయణమూర్తి సున్నితంగా ఆఫర్ ని తిరస్కరించారట. చేసేది లేక మరొక నటుడి కోసం వేటలో ఉన్నారట.
ఆర్ నారాయణమూర్తి గతంలో కూడా టెంపర్ చిత్రంలో నటించేందుకు తిరస్కరించారు. అవినీతి పరుడైన పోలీస్ ఇన్స్పెక్టర్ పక్కన ఉండే నిజాయితీపరుడైన కానిస్టేబుల్ పాత్ర కోసం ఆర్ నారాయణమూర్తిని సంప్రదించాడు పూరి జగన్నాధ్. కథలో కీలమైన ఈ పాత్రను కూడా ఆర్ నారాయణమూర్తి చేయలేదు. దాంతో పోసాని ఆ రోల్ చేయడం జరిగింది. పీపుల్స్ స్టార్ గా పేరున్న ఆర్ నారాయణమూర్తి సమాజంలోని కుళ్ళు ని కడిగేసేలా అనేక చిత్రాలు చేశారు.
జనాల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. తనకంటూ ఏమీ లేకుండా ఆర్ నారాయణమూర్తి నిరాడంబర జీవితం గడుపుతున్నారు. హీరోగా ఇప్పటికీ చిత్రాలు చేస్తున్న ఆర్ నారాయణమూర్తి… క్యారెక్టర్ రోల్స్ మాత్రం చేయడం లేదు. స్టార్ హీరోల కమర్షియల్ చిత్రాల్లో నటించేందుకు ఆయన అంగీకరించడం లేదు. ఖాళీగా అయినా ఉంటున్నారు కానీ… సోషల్ మెస్సేజ్ చిత్రాలు మాత్రమే చేయాలన్న సిద్ధాంతం వదలడం లేదు.