
కమల్ హాసన్ వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. యాక్టింగ్‌తోనే కాకుండా సింగర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మల్టిపుల్ టాలెండ్తో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. పదేళ్ల కిందట ‘లక్’ అనే సినిమాతో బాలీవుడ్ ద్వారా సినిమాలకు పరిచయం అయినప్పటికీ.. ఆశించిన విజయాలు లేక సౌత్ ఇండస్ట్రీకి మకాం మార్చింది. మొదట్లో వరుస ఫ్లాప్ లు రావడంతో ఐరెన్ లెగ్గా ముద్రపడినప్పటికీ.. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ కావడంతో ఆమె దశ తిరిగింది. తెలుగుతో పాటు తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా మారింది శ్రుతి హాసన్.
నటిగా బిజీగా ఉన్నప్పుడే మ్యూజిక్ ఆల్బమ్స్ అంటూ ఆమె విదేశాల్లో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. సినిమాలు కూడా పక్కన పెట్టేసి అతనితో చెట్టాలేసుకొని తిరిగింది. అతన్ని ఇండియా తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడంతో వీళ్లిద్దరి పెళ్లి ఖాయమైందనే వార్తలు వచ్చాయి. కానీ ఉహించని రీతిలో అతనికి బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు బుద్దిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అయితే, ప్రేమ, బ్రేకప్ కారణంగా శ్రుతి వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనట్టున్నాయి. ఈ విషయాన్ని ఆమెనే పరోక్షంగా చెప్పింది.
తాను మూడేళ్లుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నానని తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్డౌన్ అయిపోయిందని, ఇది ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని అభిప్రాయపడింది. ఇందులో మానసిక సమస్య కూడా ఒకటని చెప్పింది. అన్నింటికంటే ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నానంది. ప్రజలు అన్ని విషయాల్లో అప్రమత్తంగానే ఉంటారు కానీ.. ఇలాంటి సమస్యల గురించి బయటకు చెప్పేందుకు ఇష్టపడరని చెప్పింది. అయితే, ఈ విషయం గురించి బయటకు చెప్పేందుకు తానేమి బాధపడడం లేదని స్పష్టం చేసింది. మూడేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని, అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపింది.దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం వంటివే చికిత్స అన్నది తాను క్రమం తప్పకుండా వీటిని పాటిస్తున్నట్టు చెప్పింది. . అదే విధంగా మ్యూజిక్ వింటూ, బుక్స్ చదువుతూ మానసిక ప్రశాంతత పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది.