Pawan Kalyan- Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యల్లో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. కొన్ని రోజుల తేడాతో మహేశ్ బాబు తల్లి ఇందిర, తండ్రి కృష్ణ మరణించడంతో వారి కుమారులు, కుమార్తెలు శోకసంద్రంలో మునిగారు. ఇక ప్రిన్స్ మహేశ్ బాబును పలువురు సినీ ప్రముఖులు కలిసి ఓదార్చుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ కృష్ణకు నివాళులర్పించి మహేశ్ ను ఓదార్చారు.అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాన్ కృష్ణ గురించి మాట్లాడారు.

‘మహేశ్ బాబుకు ఇవి నిజంగా చీకటి రోజులే. అతి తక్కువ సమయంలో తల్లి, తండ్రి చనిపోవడం చాలా బాధాకరం. ఈ సమయంలో మహేశ్ కు మేమంతా అండగా ఉంటాం. ఆయన తండ్రి, కృష్ణ గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాని కోరుకుంటున్నాం.’ అని పవన్ కల్యాణ్ అన్నారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా ‘మద్రాసులో ఉన్నప్పటి నుంచి కృష్ణకు మా కుటుంబంతో అనుబంధం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో కృష్ణ చేసిన కృషి మాములుది కాదు. నిర్మాతగా, దర్శకుడిగా అనేక కోణాల్లో ఆయన విజయఢంకా మోగించాడు. రాజకీయాల్లోనూ కృష్ణ తనదైన ముద్ర వేశారు. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. తెలుగు చిత్ర రంగాన్ని ఎన్నో విధాలుగా ఆదుకున్న కృష్ణ లేరని తెలియడం బాధాకం’ అని పవన్ ట్వీట్ చేశారు.
ఇక సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆ ఏర్పాట్లకు అధికారులను ఆదేశించారు. ఇక ప్రముఖుల దర్శనం కోసం కృష్ణ పార్థివ దేహాన్ని నానక్ రామగూడలోనే ఉంచనున్నారు. ఇంట్లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత ప్రముఖుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు.

వివిధ ప్రాంతాల్లో ఉన్నా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కృష్ణను చివరిసారిగా చూసేందుకు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియానికి తరలించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం వరకు అక్కడే ఉంచి ఆ తరువాత పద్మాలాయ స్టూడియోస్ కు తరలించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిపే అవకాశం ఉందని కృష్ణ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.