Pawan Kalyan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే రాజమండ్రి లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ మెగా అభిమానులకు ఒక కనుల పండగలాగ నిల్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత పెద్ద ఈవెంట్ ని విజయవంతంగా జరిపించాము అనే తృప్తి లేకుండా పోయింది నిర్మాత దిల్ రాజుకి. ఈ ఈవెంట్ నుండి తిరిగి వెళ్తున్న సమయం లో కాకినాడ, రాజమహేంద్రవరం రోడ్డు వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని గుద్దుకొని ప్రాణాలను వదిలారు. ఈ ఘటనపై నిర్మాత దిల్ రాజు స్పందించి కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో చనిపోయిన ఇద్దరు యువకుల కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయిలను ప్రకటించారు. దిల్ రాజు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి బాధితుల కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయిలను ప్రకటించాడు.
ఈ సందర్భంగా ఆయన వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘కాకినాడ, రాజమండ్రి నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమై ఏళ్ళు గడిచాయి. గత ప్రభుత్వం ఈ రోడ్డు ని అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు కి మరమ్మత్తులు చేయిస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డు పై ఇలాంటి దుర్ఘటన జరిగి ఇద్దరు ప్రాణాలను కోల్పోవడం నా హృదయాన్ని కలిచివేసింది. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూసి ద్విచక్రవాహనాలపై తమ ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ ఇద్దరు యువకులను అటు వైపు ఎదురుగా వేగంగా వస్తున్న వాహనం ధీ కొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి యువకుల ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయిలను జనసేన పార్టీ తరుపున ప్రకటిస్తున్నాను’.
‘ప్రయాణానికి ఎంతో కీలకమైన ఈ ఏడీబీ రోడ్డుని గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఆ దారిలో సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు, ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. దాదాపుగా 5 నియోజకవర్గాల ప్రజలు ప్రయాణించే దగ్గ మార్గం ఇది. రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పనులు చేపట్టింది, మరో నెలరోజుల్లో పూర్తి అయ్యే క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరం. కేవలం నా సొంత నిధులు మాత్రమే కాకుండా, ప్రభుత్వం నుండి ఆ రెండు కుటుంబాలకు తక్షణమే సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించాను’ అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025