Ramesh Babu death: ప్రముఖ నిర్మాత, నటుడు రమేష్ బాబు మృతితో టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. కాలేయ వ్యాధితో కొద్దిరోజులుగా బాధపడుతున్న రమేష్ బాబు నిన్న సాయంత్రం 10:30గంటలకు కన్నుమూశారు. దీంతో కృష్ణ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు రమేష్ బాబు కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి రమేష్ బాబు అడుగుపెట్టారు. తొలినాళ్లలో స్టార్ హీరోగా గుర్తు తెచ్చుకున్న రమేష్ బాబు ఆ తర్వాత మాత్రం వెనుకబడ్డాడు. ఈక్రమంలోనే ఆయన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. అయితే నిర్మాతగా నష్టాలు రావడంతో నిర్మాణరంగానికి దూరమయ్యారు. తన సోదరుడు మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ మూవీకి సైతం రమేష్ బాబునే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
దాదాపు 40ఏళ్లపాటు ఆయన చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయనపై ఏనాడూ ఏ వివాదం నెలకొనలేదు. సౌమ్యుడిగా, వివాదారహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ అండ రమేష్ బాబుకు ఉన్నప్పటికీ అతడు నటుడిగా, నిర్మాతగా మాత్రం పూర్తి స్థాయిలో రాణించకపోవడం నిజంగా శోచనీయమనే చెప్పాలి.
రమేష్ బాబు మృతిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావోద్యేగానికి గురయ్యారు. రమేష్ బాబు కృష్ణగారి నట వారసత్వాన్ని కొనసాగించి నిర్మాతగానూ పలు విజయాలు అందుకున్నారని పవన్ గుర్తు చేశారు. కృష్ణగారు ఇప్పుడు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిదని.. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరకుంటున్నా అని ఒక సందేశంలో పేర్కొన్నారు.