Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో పని చేసుకుంటూ ముందుకు పోతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఒక నిజాయితీ గల నాయకుడు అధికారం లోకి వస్తే ఎలాంటి పనులు జరుగుతాయో, పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి స్థానం లో కూర్చున్నప్పుడే జనాలకు తెలిసింది. ఉపముఖ్యమంత్రి బాధ్యతలతో పాటుగా పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ & టెక్నాలజీ వంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే అద్భుతాలను సృష్టించాడు.
రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామసభలను నిర్వహించి, ఆ గ్రామాల్లో ఉండే సమస్యలకు స్వయంగా ప్రజలే తీర్మానం చేసి, వాటిని పరిష్కరించుకునే అద్భుతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేపట్టాడు. గ్రామస్వరాజ్యం కోసం కలలు కన్నా గాంధీజీ స్ఫూర్తిని జనాల్లో నింపాడు. దీనిని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ సంస్థ ప్రత్యేకంగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసం లో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యం లో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ కి ఈ అద్భుతమైన ఆలోచన రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి ఆమోదం తెలపడం..2,500 కోట్ల రూపాయిల నిధులను విడుదల చేయడం, వాటి ద్వారా గ్రామాల్లో పనులు చకచకా జరగడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం. అంతే కాదు ప్రతీ గ్రామం లోని సచివాలయం లో గ్రామాల్లో ఎంతవరకు చేపట్టారు?, ఇంకా ఎంత బ్యాలన్స్ ఉంది అనే దానిపై రికార్డు మైంటైన్ చెయ్యాలని, అది జనాలకు తెలిసేలా సచివాలయం లో బోర్డు మీద చూపెట్టాలని ఆదేశాలు జారీ చేసాడు.
వంద రోజుల్లోనే ఇంతటి మార్పు కి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కి ఈ మాత్రం గౌరవం కచ్చితంగా దక్కాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సంవత్సరానికి ఇలాంటి గ్రామసభలు నాలుగు సార్లు నిర్వహిస్తారట. ఈ మహత్తర కార్యం ద్వారా గ్రామాల్లో ఉండే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికేలా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో ఆయన తన శాఖల్లో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి. ఇకపోతే ఈ నెల 23 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ తో బిజీ కానున్నాడు. ముందుగా ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఆయన డేట్స్ కేటాయించాడు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షూటింగ్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపడుతారని తెలుస్తుంది. మంగళగిరి లోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది.