
Trivikram Srinivas: త్రివిక్రమ్ గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే త్రివిక్రమ్ పాటల రచయిత అనే విషయం. ఎక్కువుగా త్రివిక్రమ్ లో మాటల రచయితే యాక్టివ్ గా ఉంటాడు. పైగా దర్శకుడిగా మారాక, త్రివిక్రమ్ లో పాటల రచయిత నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు. అయితే, భీమ్లా నాయక్ కోసం త్రివిక్రమ్ లోని పాటల రచయితను నిద్ర లేపాడు పవన్ కళ్యాణ్.
మొదట రచయిత శ్రీమణి ‘లాలా భీమ్లా’ సాంగ్ రాశాడు. పవన్ కళ్యాణ్ కు నచ్చలేదు. ఆ తర్వాత మళ్ళీ రాయించాడు, అది కూడా పవన్ కి నచ్చలేదు. ఇక చేసేది ఏమి లేక, మొత్తానికి మరో రైటర్ చేత సాంగ్ రాయించే ప్రయత్నం చేశారు. అయితే, పవన్ మాత్రం ఆ సాంగ్ ఎవరు రాసినా నాకు కనెక్ట్ కాదు, మీరే రాయండి అంటూ త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచాడట.
దాంతో త్రివిక్రమ్ ఈ పాట కోసం పెన్ను పెట్టుకోక తప్పలేదు. నిజానికి రవితేజ నటించిన ఒక రాజు, ఒక రాణి సినిమా కోసం త్రివిక్రమ్ పాటలు రాశాడు. పైగా అప్పట్లో ఆ పాటలన్నీ బాగా విజయవంతం అయ్యాయి కూడా. అందుకే, ఆ తర్వాత పాటల రచయితగా త్రివిక్రమ్ కు అవకాశాలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం పాటలు రాయడానికి ఆసక్తి చూపించలేదు. తన సొంత సినిమాలకు కూడా త్రివిక్రమ్ సాంగ్స్ రాసుకోలేదు.
కానీ తన స్నేహితుడు పవన్ కల్యాణ్ కోరిక మీద మళ్ళీ 18 ఏళ్ల తరవాత త్రివిక్రమ్ పాట రాయక తప్పలేదు. అయితే, త్రివిక్రమ్ తప్ప ఈ పాటను మరొకరు ఎవరూ ఇంత గొప్పగా రాయలేరు. “పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…“ అంటూ త్రివిక్రమ్ ఈ పాటను రాసిన విధానం అద్భుతం.
పైగా మిగిలిన పాటలో కూడా ‘లాలా భీమ్లా…. అడవి పులి గొడవ పడి, ఒడిసి పట్టు దంచి కొట్టు కత్తి పట్టు అదరగొట్టు అంటూ ఇలా బరువైన పదాలు పరుగులు పెట్టిన విధానం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొత్తానికి త్రివిక్రమ్ పాటలోనూ తనదైన మార్క్ చూపించడంలో బాగా సక్సెస్ అయ్యాడు.