
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జానపదాలు, ప్రాంతాల యాస, భాషలకు పెద్దపీట వేస్తుంటారు. తన సినిమాల్లోనూ ఆంధ్ర, తెలంగాణ జానపద పాటలను పెట్టి అలరిస్తుంటాడు. ‘అజ్ఞాతవాసి’, అత్తారింటికి దారేదిలో ఉత్తరాంధ్ర పాటలను పాడించి అలరించాడు. ఇక అంతకుముందు తెలంగాణ జానపదాలను పలికించారు. ఇప్పుడు తన తాజా చిత్రం కోసం ‘రాయలసీమ’ యాసను పాట రూపంలో చూపించబోతున్నాడట..
ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్ దాస్ తన మాయ స్వరంతో సంగీత ప్రియులను ఆకర్షిస్తున్నాడు. రాయలసీమ నుండి వచ్చిన ఈ జానపద సంచలనం ఆ యాసలో ఇరగదీసేలా పాటలు పాడుతున్నాడు.. ఆయన సినిమా పాటలన్నీ దాదాపు ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు అతను ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన పాటతో రాబోతున్నాడు.
ఈ ప్రతిభావంతులైన జానపద గాయకుడు పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి కలయికలో ‘అయ్యప్పయం కోషియం’ రీమేక్ కోసం ఒక పాట పాడడానికి రెడీ అయ్యారు. దీనికోసం పవన్ చిత్రం టీం సంప్రదించగా ఓకే చెప్పినట్టు సమాచారం.
పెంచల్ దాస్ పాడితే ఈ పాట నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని మేకర్స్ అభిప్రాయపడ్డారు. దానికి పవన్ తోడైతే ఇక ఉర్రూత లూగడం ఖాయమంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూట్ చాలా కాలం ఆగిపోయింది. ఇప్పుడు జూలై-ఆగస్టు నుండి పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో పెంచల్ దాస్ పాట కూడా అప్పుడే రికార్డ్ చేస్తారని తెలుస్తోంది.