Pawan Kalyan: బ్రో ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్న ఉద్యోగం లేదా వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడపాలని అనుకున్నాను. కానీ నేను హీరో కావడానికి కారణం మా వదిన. అన్నయ్య నన్ను నటుడు అవుతావా? అని అడిగారు. నాకు సహజంగా సిగ్గు ఎక్కువ. నటన నా వల్ల కాదనుకున్నాను. వదిన పట్టుబట్టి హీరోని చేసింది.
వదిన చేసిన ద్రోహం వలనే నేను ఇక్కడ ఉన్నాను. ఆమెనే నన్ను ఎగదోసింది. షూటింగ్ లో అందరి ముందు డాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ప్రాణం పోయినంతపనైంది. వెంటనే వదినకు ఫోన్ చేసి నన్నెందుకు హీరో చేశావు. నేనేదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేసే వాడిని అని బాధపడ్డాను. హీరో అంటే నా దృష్టిలో చిరంజీవి మాత్రమే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ అంటే ఇష్టం. వారిలా నేను హీరో అవుతాననే ఆలోచన లేదు.
ఈ స్టార్ డమ్, అభిమానులు అంతా కలలా అనిపిస్తోంది. నేను చిరంజీవి తమ్ముడినైనా ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. మనం కష్టపడాలి. అప్పుడే మనం ఎదగగలం అని నమ్మాను. మేము దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. చిరంజీవి కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. మాకు ఎవరి అండా లేదు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేమే ఇంత చేయగలిగితే మీరెంత చేయగలరు, అన్నారు.
హీరో అవ్వాలని స్టార్డమ్ అనుభవించాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదంతా తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్న అభిప్రాయ పడ్డారు. బ్రో ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బ్రో మూవీ జులై 28న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ గా ఇది తెరకెక్కింది. సముద్ర ఖని దర్శకుడు. కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు.