Homeఆంధ్రప్రదేశ్‌మీడియా అతికి చెంప దెబ్బ.. నిల‌దీసిన‌ పవన్!

మీడియా అతికి చెంప దెబ్బ.. నిల‌దీసిన‌ పవన్!

సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ‘రిపబ్లిక్’ ఆడియో ఫంక్ష‌న్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పీచ్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అటు సినిమా ఇండ‌స్ట్రీ క‌ష్టాల‌ను వ‌ల్లెవేస్తూ.. అటు ఏపీ స‌ర్కారు ఇబ్బందిపెడుతున్న తీరును దునుమాడుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జ‌న‌సేన అధినేత‌.. ప‌నిలో ప‌నిగా మీడియాకు సైతం గ‌డ్డిపెట్టాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురైన వేళ.. కొన్ని మీడియా సంస్థ‌లు అతిగా క‌థ‌నాలు వండి వార్చాయ‌నే చ‌ర్చ జ‌రిగింది. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయా సంస్థ‌ల తీరును ఎండ‌గ‌ట్టారు నెటిజ‌న్లు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మీడియా తీరుపై మండిప‌డ్డారు. ముందుగా.. సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో ఆ వార్త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసిన మీడియాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ప‌వ‌న్‌. ఆ త‌ర్వాత అతి చేసిన కొన్ని మీడియా సంస్థ‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేయాల్సింది సాయిధర‌మ్ తేజ్ యాక్సిడెంట్ గురించో.. సినిమా వాళ్ల గురించో కాద‌న్నారు. పొలిటిక‌ల్ క్రైమ్ గురించి వార్త‌లు రాయాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి ఇలాంటి వార్త‌లు కావాల‌న్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హ‌త్య‌కు గుర‌య్యాడు? అన్న విష‌యంపై మీడియా కథ‌నాలు చేయొచ్చ‌న్నారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఒక నాయ‌కుడిపై కోడి క‌త్తితో హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని, దీని వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ కూడా అన్నార‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. మ‌రి, ఆ కుట్ర ఏమైంద‌న్న విష‌యంపైనా మీడియా స్టోరీలు చేయొచ్చ‌న్నారు.

ల‌క్ష‌లాది ఎక‌రాల‌ పోడు భూములు పేద‌ల‌కు ఆధీనంలోకి రాకుండా పోతున్న వైనంపైనా క‌థ‌నాలు రాయొచ్చ‌ని, ఆరేళ్ల చిన్నారి దారుణ హ‌త్య‌కు గురైతే.. ఆ విష‌యం వ‌దిలి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డ్డాడంటూ క‌థ‌నాలు చేయ‌డంపై ప‌వ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కొంద‌రు ప్ర‌జ‌ల వెనుక‌బాటు త‌నం, అమ్మాయిల‌పై జ‌రుగుతున్న దాడుల గురించి క‌థ‌నాలు చేయాల‌ని సూచించారు.

ఆ విధంగా.. కేవ‌లం టీఆర్పీ రేటింగ్స్ కోస‌మే కొన్ని మీడియా సంస్థ‌లు అసంద‌ర్భ‌, అన‌వ‌స‌ర‌మైన క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయ‌ని ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌ద్ధ‌తి మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. దీంతో.. మీడియా చేసిన అతిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ చెంప దెబ్బ కొట్టిన‌ట్టుగా మాట్లాడార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version