Pawan Kalyan Comments Tollywood: విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తనదైన పరిపాలన దక్షత చూపుతూ ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో గతంలో ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. వాటిలో హరి హర వీరమల్లు ఒకటి. జూన్ 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎగ్జిబిటర్స్ నిర్ణయం తలనొప్పిగా మారింది. రెంట్/పెర్సెంటేజ్ విషయంలో నిర్మాతలతో ఎగ్జిబిటర్స్ కి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో జూన్ 1 నుండి థియేటర్స్ బంద్ కి ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
ఇది హరి హర వీరమల్లు పై జరుగుతున్న కుట్రే అనే వాదన సైతం తెరపైకి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వంలో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేస్తూ… ఎన్డీయే ప్రభుత్వానికి పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుందని మండిపడ్డారు. ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. పరిశ్రమ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సీఎంని కలిశారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అగ్ర హీరోలను, ప్రముఖులను ఎలా కించపరిచారో మర్చిపోయారా? ఇకపై ప్రభుత్వం వ్యక్తులను కలవదు, సంఘాల ప్రతినిధులనే కలుస్తుంది.. అంటూ డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
తెలుగు సినిమాకు ఏపీ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. యాభై శాతం బిజినెస్ ఏపీలోనే జరుగుతుంది. అలాగే ప్రభుత్వాలతో పరిశ్రమ సన్నిహిత సంబంధాలు నెరపాల్సి ఉంది. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశాడు. గత ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయడం ద్వారా, పరిశ్రమ సమస్యలను తగ్గించామని. ఎన్డీయే ప్రభుత్వం పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా తోడుగా ఉంటుందని చెప్పకనే చెప్పారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టికెట్స్ ధరలు విపరీతంగా తగ్గించారు. సింగిల్ టీ కంటే కూడా తక్కువ ధరకు సినిమా టికెట్ అమ్మడం ఏమిటని నాని వంటి హీరోలు అసహనం వ్యక్తం చేశారు. టికెట్స్ ధరల విషయంలో వైసీపీ నేతలకు చిత్ర ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పరిశ్రమ పట్ల ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ తీవ్రంగా దుయ్యబట్టారు. టికెట్స్ ధరల విషయంలో సీఎం జగన్ తో పలుమార్లు పరిశ్రమ ప్రముఖులు చర్చలు జరిపారు. చిరంజీవి అధ్యక్షతన మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, ఆర్ నారాయణమూర్తి అప్పటి సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం టికెట్స్ ధరలు కొంత మే పెంచుతూ కొత్త జీవో జారీ చేశారు.
టికెట్స్ ధరలు తగ్గించడం ద్వారా జగన్ పరిశ్రమ ప్రముఖులను తన వద్దకు తెప్పించుకున్నాడు. చిరంజీవి వంటి ప్రముఖులను అవమానించాడు అనే వాదన బలంగా వినిపించింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక టికెట్స్ ధరల పెంపు, స్పెషల్ షోల విషయంలో స్వేచ్ఛ దొరికింది. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉన్న ఎన్డీయే పట్ల పెద్దలకు కృతజ్ఞత లేదన్న కోణంలో పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. బడా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నటులు, వివిధ సంఘాల ప్రతినిధులలో కదలిక తెచ్చినట్లు సమాచారం. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసేందుకు ప్రణాళికలు వేస్తున్నారట. పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వంతో పరస్పర సహకారం వంటి విషయాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను కలవనున్నారని సమాచారం. రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న పరిణామాలపై ఆసక్తి నెలకొంది.