
Pawan Kalyan Birthday wishes to Megastar: మెగాస్టార్ చిరంజీవి(MegaStar Chiranjeevi) పుట్టిన రోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, మెగాస్టార్ సోదరుడిగా , జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ చిరంజీవికి ఎమోషనల్ గా విష్ చేయడం మెగా అభిమానులను కదిలించింది. పవన్ గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాటలకు మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. మరి పవన్ ఆ మాటలేంటో పవన్ మాటల్లోనే విందాం.
‘చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి, మరెందరికో స్ఫూర్తి ప్రదాత, అందరికీ ఆదర్శప్రాయులు. చిరంజీవిగారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి, ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశాను.
ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనిక పై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలన చిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్‌గా కీర్తి గడించినా..చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు.
విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత చిరంజీవి గారి సొంతం. అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా భావిస్తారు లక్షలాది మంది. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న చిరంజీవి నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి… కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా వున్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు… చేస్తూనే వున్నారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారు.
అందువల్లే సినీ కార్మికులు అందరూ చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు. చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా పెద్ద మెసేజ్ పోస్ట్ చేశారు.