Pawan Kalyan Birthday Special Story: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి ముందుగా నటుడు అవ్వాలని అసలు ఉండేది కాదు. కెమెరా ముందు నిలబడడానికి, నలుగురు ముందు డైలాగ్స్ చెప్పడానికి చాలా మొహమాటం చూపించేవాడు. నటన కంటే దర్శకత్వం మరియు ఇతర విభాగాలపై ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. కానీ ఆయన వదిన సురేఖ అందగాడు, హీరో ని చేద్దాం అని చెప్పి, చాలా బలవంతంగా నటన వైపు తీసుకొచ్చారు. అప్పటికే చిరంజీవి పెద్ద సోదరుడు నాగబాబు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పెద్దగా సక్సెస్ కాకపోవడం తో పవన్ కళ్యాణ్ పై చాలా తక్కువ అంచనాలే ఉండేవి. కానీ ఆయన పరిచయం మాత్రం చాలా కొత్త రీతిలో జరిగింది. సినిమా షూటింగ్ మొదలైన కొత్తల్లో ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ పోస్టర్స్ ని రాష్ట్రవ్యాప్తంగా గోడల మీద అంటించారు. కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ముఖాన్ని రివీల్ చేయలేదు.
Also Read: ఓజీ’ క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోలేరా..? సుజిత్ రిస్క్ చేస్తున్నాడా!
ఎవరీ అబ్భాయి? అనే ఆత్రుత అందరిలో కలిగించేలా చేశారు మేకర్స్. అలా కొన్ని రోజులు భారీ సస్పెన్స్ తర్వాత ఇతను చిరంజీవి గారి రెండవ తమ్ముడు అని జనాలకు రివీల్ చేశారు. అలా ఆ చిత్రం పై ఒక మోస్తారు ఆసక్తిని ఆడియన్స్ లో రప్పించడంలో సక్సెస్ అయ్యారు. కానీ రామ్ చరణ్ కి జరిగినంత భారీ డెబ్యూ మూవీ హంగామా పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ కి జరగలేదు. ఓపెనింగ్స్ కూడా యావరేజ్ రేంజ్ లోనే వచ్చాయి. అలా మొదలైన పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ ‘గోకులం లో సీత’, ‘సుస్వాగతం’ వంటి వరుస విజయాలతో యూత్ ఆడియన్స్ కి నెమ్మదిగా దగ్గర అయ్యేలా చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రం మాత్రం ఒక సునామీ ని సృష్టించింది అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి తమ్ముడు మాత్రమే.
ఆ సినిమా తర్వాత నుండి మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక తర్వాత వచ్చిన తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచి పవన్ కళ్యాణ్ ని యూత్ ఐకాన్ గా మార్చాయి. ఒకానొక దశలో యూత్ ఫాలోయింగ్ లో మెగాస్టార్ చిరంజీవి ని కూడా దాటేశాడు అని చెప్పొచ్చు. కానీ ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ కొంత తడబడింది. కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ విడుదలైన జానీ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనలోని డైరెక్టర్ ని జనాలకు పరిచయం చేశాడు. ఆరోజుల్లోనే అత్యాధునిక టెక్నలజీ తో, పూర్తి స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ మీద తెరకెక్కిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ చిత్రమిది. కానీ లవ్ స్టోరీస్, ఫ్యాక్షన్ స్టోరీస్, మాస్ మసాలా మూవీస్ రాజ్యం ఏలుతున్న ఆ రోజుల్లో ఆడియన్స్ ఈ చిత్రం అర్థం కాలేదు.
కానీ కాలం గడిచే కొద్దీ ఆ సినిమాకు క్రేజ్ పెరిగింది. ఇక జానీ తర్వాత విడుదలైన ‘గుడుంబా శంకర్’ బాక్స్ ఆఫీస్ వద్ద బిలో యావరేజ్ గా నిల్చింది. కానీ భవిష్యత్తులో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి ప్రేరణగా నిల్చింది ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే. అప్పటి వరకు విలన్ ని కమెడియన్ గా చూపించే ఆలోచన ఎవరికీ రాలేదు. పవన్ కళ్యాణ్ కి ఆ ఆలోచన వచ్చింది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ఆయనే అందించాడు. ఇక ఆ తర్వాత విడుదలైన ‘బాలు’ చిత్రం కూడా యావరేజ్ గా ఆడింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, ఓవరాల్ సినిమా ఆడియన్స్ కి యావరేజ్ గా అనిపించింది. కానీ భవిష్యత్తులో ఎన్నో గ్యాంగ్ స్టర్ మూవీస్ ఈ చిత్రాన్ని ఆధారంగా తీసుకొనే తెరకెక్కాయి.
ఇక ఆ తర్వాత విడుదలైన ‘బంగారం’, ‘అన్నవరం’ వంటి చిత్రాలు కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ నుండి సూపర్ హిట్ కి దగ్గరగా చేరాయి. ఈ రెండు సినిమాల తర్వాత విడుదలైన ‘జల్సా’ చిత్రం మాత్రం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇప్పటి తరం యూత్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా అంటే పిచ్చి. కానీ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సరిగా తీసి ఉండుంటే, ఆరోజుల్లో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది, కానీ ఓవరాల్ గా టాప్ 2 గ్రాసర్ గా నిల్చింది. ఇక జల్సా తర్వాత పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో అసలు సిసలు గడ్డు కాలాన్ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన పులి,తీన్మార్, పంజా చిత్రాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.
ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది అని అంతా అనుకుంటున్న సమయం లో ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా హిస్టరీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2012 సంవత్సరం లోనే 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన చిత్రమిది. ఇక ఆ తర్వాత విడుదలైన కెమెరా మెన్ గంగతో రాంబాబు యావరేజ్ గా ఆడినా, అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి నెంబర్ 1 హీరో గా మారాడు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి సినిమాల మీద ఉన్న ఫోకస్ వేరు. కానీ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆయన ఫోకస్ ప్రధానంగా సినిమాల వైపు వెళ్ళింది. కథల ఎంపిక విషయం లో ఫోకస్ పెట్టలేదు. ఫలితంగా సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి వంటి వరుస ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని వకీల్ సాబ్ చిత్రం తో మన ముందుకు వచ్చాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సెమీ హిట్ గా నిల్చింది. కారణం కరోనా పీక్ రేంజ్ కి వెళ్లిన సమయం లో విడుదల అవ్వడమే. కానీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. కరోనా లేకపోయుంటే ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘భీమ్లానాయక్ ‘ కూడా దాదాపుగా హిట్ స్టేటస్ కి దగ్గరగా చేరుకుంది. అప్పటి సీఎం జగన్ ఈ చిత్రానికి టికెట్ రేట్స్ ఇవ్వకపోవడం వల్ల భారీ వసూళ్లను అందుకోలేకపోయింది కానీ, లేకుంటే ఇది కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యేది. ఈ సినిమా తర్వాత వచ్చిన బ్రో కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది, ఆ తర్వాత ఆంధ్ర ప్రద్రేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి వచ్చిన ‘హరి హర వీరమల్లు’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక ఈ నెల లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగా, ఏ ఇండియన్ సినిమాకు జరగనంత భారీ బుకింగ్స్ ఈ సినిమాకు జరుగుతుంది. చూస్తుంటే ఇండస్ట్రీ హిట్ కల కనిపిస్తుంది. అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు ఆగాల్సిందే.