Bheemla Nayak: ఇప్పుడు టాలీవుడ్లో మార్మోగుతున్న పాట ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) టైటిల్ సాంగ్. పవన్ కల్యాణ్ (Pawan kalyan) పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలైన ఈ పాట.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఈ పాట విడుదలైన 22 గంటల్లోనే.. 8 మిలియన్లకు పైగా వ్యూస్ తో రచ్చ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్ 1 స్థానంలో ఉన్న భీమ్లా నాయక్ సాంగ్.. అభిమానులను ఉర్రూతలూపుతోంది.
అయితే.. ఈ పాటకు థమన్ సమకూర్చిన స్వరాలు, పిక్చరైజేషన్ తోపాటు అందరినీ ఆకట్టుకుంటున్న అతి ముఖ్యమైన పాయింట్ గాత్రం. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఇద్దరు పాడారు. ఇందులో ముందుగా సాకీతో మొదలు పెట్టి, అద్భుతంగా ఆలపించిన జానపద గాయకుడు, కిన్నెర మెట్ల వాయిద్యకారుడైన దర్శనం మొగిలయ్య గురించే ఇప్పుడు జోరుగా డిస్కషన్ నడుస్తోంది.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో సాకీ, పల్లవిని ఆలపించిన దర్శనం మొగిలియ్య.. తన గాత్రంతో శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత చరణాలను మరో ప్రముఖ సింగర్ రామ్ మిరియాల అందుకున్నారు. వీరిద్దరి కలయికలో పూర్తయిన ఈ పాట.. పవర్ స్టార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట విన్నవారంతా.. రెగ్యులర్ గొంతుకు పూర్తి భిన్నంగా ఉన్న మొగిలయ్య గురించి చర్చించుకుంటున్నారు. ఎవరీ గాయకుడు? ఎక్కడ ఉంటాడు? అంటూ ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు.
దర్శనం మొగులయ్య వివరాలు చూస్తే.. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో విస్తరించిన నల్లమల ప్రాంతానికి చెందిన వారు. ఈయన ఏడు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు. తండ్రి ఎల్లయ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని అందుకొని.. అదే జీవితంగా ముందుకు సాగారు. అంతేకాదు.. ఆ ఏడు మెట్ల వాయిద్యాన్ని.. 12 మెట్లుగా మార్చి.. ప్రదర్శనలు ఇచ్చారు.
అంతరించిపోతున్న జానపద కళల్లో.. ఈ కిన్నెర వాయిద్యం కూడా ఉంది. అయితే.. దర్శనం మొగులయ్య కళను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఉగాది పురస్కారంతో సత్కరించింది. అంతేకాదు.. ఆయన జీవితాన్ని ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా కూడా చేర్చి, ఘనమైన గుర్తింపును అందించింది. అయితే.. అద్భుతమైన కళను సొంతం చేసుకున్న మొగిలయ్య.. ఆర్థికంగా ఏమీ బావుకోలేకపోయారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేక.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మొగులయ్య గురించి తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆయనను తన సినిమాలో పాట పాడేలా చూశారు. ఈ పాట కోసం మొగులయ్యను చెన్నై పంపించి, అక్కడే రికార్డు చేయించారు. ఆ తర్వాత.. తమిళనాడు అడవుల్లోనే ఆయనపై సాకీ, పల్లవిని చిత్రీకరించారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాటకు వస్తున్న క్రేజ్ చూసి, తన గాత్రానికి వస్తున్న వెల్లువెత్తుతున్న అభినందనలు చూసి మొగులయ్య సొంతోషం వ్యక్తం చేస్తున్నారు.