Pawan Kalyan: ఈ ఏడాది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన అభిమానులకు రెండు భిన్నమైన అనుభూతులను కలిగించాడు. మొదటి అనుభవం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా అభిమానులకు అర్థ రాత్రి వేళ వచ్చే ఒక పీడకల లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా విడుదలైన రెండు నెలలకే పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అసలు సిసలైన దసరా పండుగ తీసుకొచ్చాడు. కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ పడేలోపు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇది కదరా పవన్ కళ్యాణ్ విశ్వరూపం అంటూ థియేటర్స్ హోరెత్తించారు. ఒక సినిమా ఏమో ఈ ఏడాది లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలితే, మరో సినిమా ఈ ఏడాది లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది.
130 కోట్ల రూపాయిల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి థియేటర్స్ లో విడుదల అయ్యాక కేవలం 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అంటే దాదాపుగా 60 కోట్ల రూపాయిల నష్టం. ఈ ఏడాది అంత నష్టాలను చూసిన మరో సినిమా లేదు. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంత చెత్తగా ఉన్నప్పటికీ వీకెండ్ వరకు కచ్చితంగా మంచి వసూళ్లను నమోదు చేసుకుంటూ ఉంటాయి .కానీ ఈ సినిమాకు రెండవ రోజు నుండి అసలు కనీస స్థాయి వసూళ్లు కూడా ఈ చిత్రం నమోదు చేసుకోలేకపోయింది. ఇంత పెద్ద ఫ్లాప్ చూసిన తర్వాత ఓజీ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఎవరైనా ఊహిస్తారా?, ఈ సినిమా విడుదలైన రెండు నెలల గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని అభిమానుల ఆకలి తీర్చాడు.
ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముందు ఈ చిత్రం 170 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది. క్లోజింగ్ కి దాదాపుగా 189 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 316 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే బయ్యర్స్ కి దాదాపుగా 19 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఇలా ఒకే ఏడాది లో పవన్ కళ్యాణ్ భారీ నష్టాలు ఇచ్చిన హీరో గా, అదే సమయం లో హైయెస్ట్ గ్రాసర్ ని అందుకున్న హీరో గా సరికొత్త రికార్డు ని నెలకొల్పాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే విడుదలకు బ్యాలన్స్ ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ఓజీ లాగా అభిమానులకు తీపి జ్ఞాపకాలను అందిస్తుందా?, లేదంటే హరి హర వీరమల్లు లాగా చేదు జ్ఞాపకాలను మిగులుస్తుందా అనేది చూడాలి.