మోహన్ బాబు.. మాటలో కోపం కనిపించినా.. ఆయన మనసు మంచిది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సంఘటనలు.. వాటిల్లో కన్నీళ్లు పెట్టించేవి ఉన్నాయి, సంతోషాన్ని మిగిల్చిన అనుభూతులు ఉన్నాయి. మరి ఐదు వందలకు పైగా సినిమాలు.. పైగా నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా అన్నిటికీ మించి హీరోగా మోహన్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా.. అది తక్కువే అవుతుంది.

కాగా తాజాగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నో విషయాలు చెప్పారు. వాటిల్లో ముఖ్యమైన వాటిని ముచ్చటించుకుందాం. నటుడిగా జీవితం ప్రారంభించడానికి మోహన్ బాబు చాలా కష్టపడ్డారట. అయితే, ఆయన మంచి విలన్ అవ్వాలి అని పరిశ్రమలోకి వచ్చారు. ఎన్నో కష్టాలు తర్వాత.. దాసరి గారు ‘స్వర్గం నరకం’ సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా జీవితాన్ని ఇచ్చారు. అందుకే, ఇప్పటికీ దాసరిగారిని గురువు గానే భావిస్తున్నారు మోహన్ బాబు.
మోహన్‌బాబు అసలు ఊరు మోదుగులపాలెం. మోహన్‌బాబు నాన్న గారు ఎలిమెంటరీ టీచర్. మోహన్ బాబు అమ్మ గారికి మొదట్లో సంతానం కలగకపోతే.. శివాలయంలో సంతాన ప్రాప్తి కోసం పూజలు చేస్తే.. మోహన్ బాబు జన్మించారు. మోహన్ బాబు గారికి చిన్న తనం నుంచి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఎన్టీఆర్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవారు.
అలా తెలియకుండానే సినిమా పై ఆసక్తి పుట్టి.. చెన్నై చేరుకున్నారు. మొదట ఓ స్కూల్ లో ఉద్యోగం చేసి.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి.. ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారి సాయంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..జూనియర్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత విలన్ గా, ఆ తర్వాత హీరోగా మోహన్ బాబు రాణించారు.
ఇక ఓ సినిమాకి మోహన్ బాబు ఆరు నెలలు పని చేస్తే.. జీతం రూ.50 ఇచ్చారట. ఇదేంటి ? అని అడిగితే.. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. అసలు నీ జీవితంలో హైదరాబాద్ చూడగలవా ? అంటూ చాలా హేళనగా మాట్లాడి దారుణంగా అవమానించారట. అయితే స్వతహాగా కోపధారి అయిన మోహన్ బాబు తనను ఎంత హేళనగా మాట్లాడినా నమస్కారం పెట్టి వచ్చారట.