Paruchuri Gopala Krishna- Rakesh Master
Paruchuri Gopala Krishna- Rakesh Master: రాకేష్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురైన రాకేష్ మాస్టర్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాకేష్ మాస్టర్ మృతిపై చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తమ సంతాపం ప్రకటించారు. రాకేష్ మాస్టర్ కెరీర్లో నిరాదరణకు గురయ్యాడు. అతని ముక్కుసూటితనం, తప్పును ప్రశ్నించే తత్త్వం కెరీర్లో ఎదగనీయలేదు. జీవితాంతం పరిశ్రమ నాకు అన్యాయం చేసిందనే ధోరణిలోనే బ్రతికాడు. కెరీర్ పోవడంతో మద్యానికి బానిసయ్యాడు.
రాకేష్ మాస్టర్ మృతిపై సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. అతన్ని ఎవరైనా పట్టించుకుని పరిశ్రమకు తీసుకు వస్తే బాగుండేదని అన్నారు. రాకేష్ మాస్టర్ మరణవార్త టీవీలో విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. రాకేష్ మాస్టర్ తో నేను పని చేసింది లేదు. ఆయన గురువు ముక్కు రాజుతో పలు చిత్రాలకు పని చేశాను. రాకేష్ మాస్టర్ 1500లకు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశాడు. శేఖర్, జానీ వంటి గొప్ప మాస్టర్స్ ని పరిశ్రమకు అందించారు.
అతని షోలు చూసినప్పుడల్లా ఆవేదన కనిపించేది. కనీసం ఈ తరం దర్శకులు, నటులు ఆయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాల్సింది. వేదనలో ఉన్న రాకేష్ మాస్టర్ ని కలిసి అతని బాధ వినాల్సింది. అలా ఎవరూ చేయలేదు. రాకేష్ మాస్టర్ కుమారుడు ఇకనైనా మా నాన్న గురించి మాట్లాడుకోవడం మానేయండని చెబుతుంటే గుండె ద్రవించిపోయింది. జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటిని ఎదిరించి నిలబడాలి. కుదుపుకు లోను కాకూడదని ఆయన చెప్పుకొచ్చారు.
తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ వద్ద శిష్యరికం చేశాడు. అనంతరం హైదరాబాద్ లో డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ప్రభాస్, వేణు తొట్టెంపూడి వంటి హీరోలకు డాన్స్ లో శిక్షణ ఇచ్చాడు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అతని వద్ద శిష్యులుగా చేశారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ తో రాకేష్ మాస్టర్ గొప్ప అనుబంధం కలిగి ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.