
MAA Elections: నిండా 1000 మంది కూడా లేని తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నికలపై సినీ ప్రముఖులు ఇంతగా ఎందుకు ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారో అంతుబట్టడం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) ఎన్నికల షెడ్యూల్ రాకముందే పార్టీలు, విందు రాజకీయాలను మొదలుపెట్టేశారు. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు, నటుడు నరేశ్(naresh) ఈ శనివారం ప్రముఖ ‘దస్ పల్లా’ హోటల్ లో వీకెండ్ బిగ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు దస్ పల్లా హోటల్ లో ఈ పార్టీకి తోటి నటీనటులకు ఆయన స్వయంగా మెసేజ్ లు పంపాడు. నరేశ్ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. నగరంలోని దసపల్లా హోటల్ లో శనివారం సాయంత్రం 6 గంటలకు పార్టీ జరుగనుందని.. ఈ మేరకు శుక్రవారం అందరికీ ఆహ్వానం పంపించినట్టు ‘నరేశ్ విజయ కృష్ణ’ పేరుతో ఓ వాట్సాప్ మెసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది.
వచ్చే నెలలోనే ‘మా’ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానల్ తోపాటు మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ తదితరులు అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్నారు.
నాగబాబు, మెగా సినీ ప్రముఖులు ప్రకాష్ రాజ్ వెంట ఉండగా.. మంచు విష్ణు వెంట నరేశ్ తోపాటు పాత కార్యవర్గం సభ్యులు మద్దతుగా నిలుచుకున్నారు.
ఇప్పటికే నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈనెల 29న ప్రకాష్ రాజ్ సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చాడన్న ఓ మెసేజ్ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మా సభ్యులను ఆకట్టుకునేందుకు నటుడు నరేశ్ సైతం ఈ విందు రాజకీయాలకు తెరదీసినట్టుగా తెలుస్తోంది.