Upasana: తెలుగు తెర మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా ఇతర పరిశ్రమల సినీ నటులు కూడా చిరంజీవిని అభినందిస్తున్నారు. తనకు ఈ పురస్కారం దక్కడం పట్ల గర్వంగా ఉందని, తనను పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరంజీవిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే చిరంజీవికి ఆయన కోడలు కొణిదెల ఉపాసన వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. తన మామకు పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన నేపథ్యంలో ఆమె ఎమోషనల్ అయ్యారు. సంబంధించిన ఒక పోస్టును ఆమె తన సామాజిక మాధ్యమాలలో రాసుకొచ్చారు.
చిరంజీవి తన మొదటి కూతురు సుస్మిత పిల్లలు, రెండవ కూతురు శ్రీజ పిల్లలు, తన కుమారుడు రామ్ చరణ్ కూతురుతో కలిసి దిగిన ఫోటోను ఉపాసన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. మీరు చూసే ఈ ఐదుగురు అత్యంత శక్తివంతమైన చేతి ఐదు వేళ్ళు. ఈ శక్తివంతమైన ఐదువేళ్ళను ఒక చేయి పిడికిలిగా బిగించుకుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. దాతృత్వంలో మాత్రమే కాదు.. జీవితంలో భర్తగా, నాన్నగా, తాతగా, చిరుతగా మాలో స్ఫూర్తి నింపారు. మీకు మా అభినందనలు. లవ్ యు కొణిదెల చిరంజీవి అంటూ ఉపాసన సామాజిక మాధ్యమాలలో రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టును రీ పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం పొందడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రామ్ చరణ్, నాగబాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అరవింద్, అల్లు శిరీష్ పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగి ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ప్రస్తుతం పద్మ విభూషణ్ చిరంజీవి అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.