Junior NTR- Ram Charan: ఆర్ ఆర్ ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అకాడమీ మెంబర్షిప్ కొరకు వీరికి ఆహ్వానం లభించింది. వరల్డ్ వైడ్ 398 మంది చిత్ర ప్రముఖులకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మెంబర్షిప్ కి ఆహ్వానం అందింది. ఆస్టిన్ బట్లర్, కే హూ క్వాన్, కేకే పాల్మర్, సింగర్ టైలర్ షిఫ్ట్ తో పాటు పలువురు ఈ లిస్ట్ లో ఉన్నారు. అకాడమీ కమిటీ పంపిన ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం ద్వారా వీరు అకాడమీ మెంబర్షిప్ పొందుతారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ ఫేమ్ పొందారు. వీరిద్దరి పేర్లు హాలీవుడ్ మేకర్స్ నోటి వెంట వినిపిస్తున్నాయి. ఆస్కార్ కమిటీ మెంబర్ షిప్ ఆహ్వానం పంపి వారి ఇమేజ్ ఏమిటో తెలియజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ కైవసం చేసుకుంది. కీరవాణి, చంద్రబోస్ వేదికపై ఆస్కార్ అందుకున్నారు. తెలుగు సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
నాటు నాటు సాంగ్ మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ సైతం గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది. నాటు నాటు సాంగ్ ప్రాచుర్యం పొందడానికి ప్రేమ్ రక్షిత్ స్టెప్స్ కారణమయ్యాయి.
ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జపాన్ లో వంద రోజులకు పైగా ఆడింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించారు. అలియా భట్ హీరోయిన్ కాగా అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు.