Yatra 2: ఒక రోజు ముందే వైసీపీ ఎమ్మెల్యేల ‘యాత్ర 2’

యాత్ర – 2 సినిమాను వైసీపీ ఎమ్మెల్యేలకు ఒకరోజు ముందే స్పెషల్‌ షో వేశారు చిత్ర యూనిట్‌. బుధవారం(ఫిబ్రవరి 7న) అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడింది.

Written By: Raj Shekar, Updated On : February 8, 2024 10:40 am

Yatra 2

Follow us on

Yatra 2: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా యాత్ర – 2. వైఎస్సార్‌ మరణానంతరం చోటుచేసుకున్న పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటించగా. జగన్‌మోహన్‌రెడ్డి పాత్రను జీవా పోషించారు. భారీ అంచనాలతో ఈ సినిమా గురువారం(ఫిబ్రవరి 8న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలను యాత్రలో చూపించిన దర్శకుడు మహి వి. రాఘవ. యాత్ర – 2లో పూర్తిగా వైఎస్సార్‌ మరణానంతర పరిణామాలను తెరకెక్కించారు. యాత్ర సిని వచ్చిన ఐదేళ్ల తర్వాత సీక్వెల్‌గా యాత్ర – 2 రాబోతోంది.

ఎమ్మెల్యేలకు స్పెషల్‌ షో..
యాత్ర – 2 సినిమాను వైసీపీ ఎమ్మెల్యేలకు ఒకరోజు ముందే స్పెషల్‌ షో వేశారు చిత్ర యూనిట్‌. బుధవారం(ఫిబ్రవరి 7న) అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడింది. దీంతో విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో ఉన్న క్యాపిటల్‌ సినీ మాల్‌లో యాత్ర – 2 స్పెషల్‌ షో ప్రదర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు ఈ షోను వీక్షించారు.

స్పందించిన ఎమ్మెల్యేలు..
– ‘యాత్ర’లో వైఎస్సార్‌ పాదయాత్రను కీలక అంశంగా చూపించారని, యాత్ర – 2లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌(పూరీ జగన్నాథ్‌ సోదరుడు) తెలిపారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌ను వైఎస్సార్‌ తన పాదయాత్రతో అధికారంలోకి తీసుకువచ్చారని, దాన్నే యాత్ర సినిమాలో చూపించారని, యాత్ర – 2లో జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఢీకొట్టిన పాదయాత్ర చేసిన కీలక ఘట్టాలను చూపించారని తెలిపారు. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదని, అందరూ చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

– ‘దివంగత నేత వైఎస్‌కి ప్రతిరూపంగా మమ్ముట్టిని చూశాం. ఇది పబ్లిసిటీ కాదు.. వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అంటే రియల్‌ హీరో. ఆయన్ని ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.. మా నాయకుడిలా వేరే వాళ్లు నటించారు కాబట్టి.. ఎలా ఉన్నారో చూద్దాం అని వచ్చాం.. యాత్ర – 2 వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టింది.. అద్భుతంగా ఉంది’ అని తెలిపారు మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.

– ‘యాత్ర, యాత్ర 2 రెండు సినిమాలు మన కళ్ల ముందు జరిగిన చరిత్రేనని, వైఎస్సార్‌ ఐదేళ్ల పాలనలో కోట్లాది మందికి దగ్గరైన నాయకుడిగా ఎదిగిన తీరును కళ్లకు కట్టారు’ అని తెలిపారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామృష్ణారెడ్డి.

– ‘యాత్ర 2 సినిమా చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. జగన్‌మోహన్‌రెడ్డి పడిన కష్టాలను కళ్లకు కట్టారు’ అని పేర్కొన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు.

– ‘యాత్ర సినిమా చూస్తే స్వర్గీయ నందమూరి తారకరామారావు సంతోషపడతారు’ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి.