Om Raut : ఏమయ్యా ఓం రౌత్..ఒక్కసారి ఈ జపనీస్ రామాయణ్ చూసి బుద్ధి తెచ్చుకో..

1992లో వచ్చిన జపనీస్ రామాయణ్.. ఆదిపురుష్ కంటే బాగుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ జపాన్ సినిమాను చూసిన ప్రేక్షకులు.. ఓం రౌత్ తీసిన అది పురుష్ సినిమాను ఏకిపారేస్తున్నారు. " ఓం రౌత్..ఈ జపాన్ రామయణ్ ను మక్కీకి మక్కీ దింపినా బాగుండేది." అని చురకలు అంటిస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : June 18, 2023 3:01 pm
Follow us on

Om Raut : ప్రస్తుతం దేశవ్యాప్తంగా “ఆది పురుష్” గురించి చర్చ నడుస్తోంది. సినిమా బాగుందని కొందరు, బాగోలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇంకొందరేమో వందల కోట్లను కొల్లగొడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో కొంతమేర మాత్రమే విజయవంతమైంది. అయినప్పటికీ ప్రభాస్ కు నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ ఉండడంతో మంచి వసూళ్లు సాధిస్తున్నది. ఇదంతా జరుగుతుండగానే ఆది పురుష్ సినిమాని దాదాపు 30 సంవత్సరాల క్రితం జపాన్ లో వచ్చిన “రామాయణ్” సినిమాతో పోల్చి చూస్తున్నారు. దీంతో ఆ చిత్రం కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ మారిపోయింది.
వాస్తవానికి రామాయణం గురించి కొత్తగా మాట్లాడుకునేందుకు ఏమీ లేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతోమంది రామాయణ ఇతివృత్తంగా రూపొందిన సినిమాల్లో నటించారు. యుద్ద కాండ, అరణ్యకాండ మాత్రమే కాదు ఎన్నో నేపథ్యాలతో సినిమాలు రూపొందాయి.. ప్రేక్షకుల ఆదరణ పొందాయి. బాపు రమణ చివరి రోజుల్లో బాలకృష్ణ హీరోగా శ్రీరామరాజ్యం అనే సినిమా తీశారు. నయన తార అందులో హీరోయిన్. ఆ సినిమా అప్పట్లో చాలామందిని భక్తిపారవశ్యం లో ముంచింది. అప్పటినుంచి ఇప్పటివరకు రామాయణ ఇతివృత్తంగా సినిమాలు రాలేదు. ఇప్పుడు తాజాగా విడుదలైన ప్రభాస్ “ఆదిపురుష్” వల్ల రామాయణం గురించి మాట్లాడుకునే అవకాశం దక్కింది. మన దేశంలో రాముడు పాలించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి.. దేవుడిగా కొలుస్తారు. రామాయణానికి, రాముడికి ఏ మాత్రం సంబంధం లేని జపాన్ దేశంలో మూడు దశాబ్దాల క్రితమే అంటే 1992 లో “రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ” అనే పేరుతో యానిమేటెడ్ సినిమా తీసి బంపర్ హిట్ సాధించారు.
వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా ఈ యానిమేటెడ్ సినిమా తీసి కోట్లు కొల్లగొట్టారు. ఈ సినిమాను ఇప్పటికీ జపనీయులు తమ ఫేవరెట్ సినిమాగా పేర్కొంటారు. ఇక 1980లో జపనీస్ యానిమేటర్ యుగో సాకో తొలిసారి భారతదేశాన్ని సందర్శించారు. ఇక్కడి చారిత్రాత్మక ప్రదేశాలు చూసి రామాయణాన్ని విజువల్ గా చూపిద్దామనే ఆలోచన ఆయనకు వచ్చింది. కానీ రామాయణ గురించి మరింత తెలుసుకునేందుకు దాదాపు 60 సార్లు ఆయన భారతదేశానికి వచ్చారు. 1985లో ఆయన అయోధ్యను దర్శించినప్పుడు.. రామాయణాన్ని డాక్యుమెంటరీగా తీయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత యుగో సాకో.. “ఫాదర్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్” మోహన్ తో పాటు 450 మందితో కలిసి తీవ్రంగా శ్రమించి రామాయణం సినిమాని ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ గా తీర్చిదిద్దారు. రాముడు దేవుడు కాబట్టి యానిమేషన్ లో తీస్తేనే బాగుంటుందని భావించి ఆ సినిమా రూపొందించామని సాకో చెప్పుకొచ్చారు.
1992లో విడుదలైన “రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ” జపాన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మన దగ్గర మాత్రం సరిగ్గా ఆడలేదు. పబ్లిసిటీ చేయకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆది పురుష్ సినిమాను 500 కోట్లతో నిర్మిస్తే.. జపనీస్ రామాయణాన్ని 1992లో 80 కోట్ల జపనీస్ యెన్ లతో నిర్మించారు. ఇక ఈ సినిమాలోని పలు పాత్రలకు  బాలీవుడ్ లో పేరుపొందిన నటులు డబ్బింగ్ చెప్పారు. అయితే బాలీవుడ్ సినిమా క్రిటిక్స్ అభిప్రాయాల ప్రకారం జపనీస్ “రామాయణ్” సినిమాలో స్ఫూర్తిగా తీసుకొని ఓం రౌత్ ఆది పురుష్ తీశాడు అని చెబుతున్నారు. దాని ప్రకారమే సినిమా తీశాడు అనుకుంటే.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటే సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. కానీ ఆ విషయంలో ఓం రౌత్ ఫెయిల్ అయ్యాడు.. 1992లో వచ్చిన జపనీస్ రామాయణ్.. ఆదిపురుష్ కంటే బాగుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ జపాన్ సినిమాను చూసిన ప్రేక్షకులు.. ఓం రౌత్ తీసిన అది పురుష్ సినిమాను ఏకిపారేస్తున్నారు. ” ఓం రౌత్..ఈ జపాన్ రామయణ్ ను మక్కీకి మక్కీ దింపినా బాగుండేది.” అని చురకలు అంటిస్తున్నారు.