RRR సినిమా తర్వాత ఎలాంటి కథ చేయాలనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే త్రివిక్రమ్ తో సినిమా క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం సాగింది. త్రివిక్రమ్ చెప్పిన రెండు మూడు లైన్లు కూడా వద్దనుకోవడంతో.. లైన్లోకి వచ్చాడు దర్శకుడు కొరటాల శివ. దీంతో.. జూనియర్ ను అంతగా ఇంప్రెస్ చేసిన కథ ఏమై ఉంటుంది? ఏం చెప్పి కొరటాల ఒప్పించాడనే క్యూరియాసిటీ బయల్దేరింది.
ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘జనతా గ్యారేజ్’. సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రంలో సామాజిక బాధ్యతను చొప్పించాడు దర్శకుడు. సోషల్ రెస్పాన్సిబులిటీ చుట్టూ కమర్షియల్ అంశాలను అల్లుకొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో.. ఇప్పుడు ఎలాంటి సినిమాతో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. హిమాలయాల్లోంచి తొలిసారి నాగరిక జీవనంలోకి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తాడట జూనియర్. అతని మనస్తత్వం కల్లాకపటం తెలియని చిన్న పిల్లలను పోలి ఉంటుందని సమాచారం.
RRR తర్వాత చేస్తున్న సినిమానే కాకుండా.. ఎన్టీఆర్ 30వ చిత్రం కూడా కావడంతో.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ జూన్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇద్దరు హీరోయిన్లకు ఈ చిత్రంలో అవకాశం ఉంటుందని, బాలీవుడ్ నుంచి ఒకరిని.. సౌత్ నుంచి మరొకరిని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.