
సినిమాల్లో ఐటెం సాంగ్స్ కొత్తేం కాదు. చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమే ఇది. అయితే, ఈ మధ్య ఇలాంటి పాటల విషయంలో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ దర్శకులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. స్టార్ హీరోయిన్లపై ప్రత్యేక పాటలు తీస్తూ సినిమాలను బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. దాదాపు యాభై నుంచి కోటి రూపాయాల పారితోషికం రావడం.. మాగ్జిమమ్ నాలుగైదు రోజుల డేట్స్ ఇస్తే పరిపోతుంది కాబట్టి అగ్ర కథానాయికలు ఐటమ్ నంబర్స్‌కు హ్యాపీగా ఓకే చెబుతున్నారు. ఈ లిస్ట్‌లో రమ్యకృష్ణ, రాశి, రంభ, అనుష్క, శ్రియ, కాజల్, తమన్నా, శ్రుతి హాసన్, చార్మి తదితరులు ఉన్నారు.
వీరిందరిలో మిల్కీ బ్యూటీ తమన్నా చాలా ప్రత్యేక గీతాల్లో నర్తించింది. 2014లో అల్లుడు శీను చిత్రంలో ‘లబ్బర్ బొమ్మ’తో తొలిసారి ఐటమ్ నంబర్ చేసిన ఆమె తర్వాత స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, కేజీఎఫ్ 1తో పాటు మొన్నటి సరిలేరు నీకెవ్వరూ వరకూ వరుసగా ప్రత్యేక గీతాలు చేస్తూ వస్తోంది. దీంతో డబ్బు కోసమే తమన్నా ఇలా ఐటెం పాటల్లో నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మిల్కీ బ్యూటీ స్పందించింది. తనకు ఇలాంటి ప్రత్యేక పాటలంటే ఇష్టమని చెప్పింది. ముఖ్యంగా డ్యాన్స్ అంటే తనకు ప్రేమ అని, ఇలాంటి పాటల్లో అయితేనే తన నట్య ప్రతిభను బయటపెట్టొచ్చని తెలిపింది. అంతే తప్ప డబ్బు కోసమే ప్రత్యేక పాటలు చేస్తున్నానని అనడం సరికాదని చెప్పింది. ఇలాంటి ప్రచారాన్ని తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేసింది.