
సినిమా ఇండస్ట్రీలో అవకాశల కోసం నలిగిపోతున్న చిన్నాచితకా బతుకులకు ఇన్నాళ్లు ఒక ఆశ ఉండేది. సినిమాలు లేకపోయినా ఓటీటీలోనైనా తమ సినిమాని లేదా వెబ్ సిరీస్ లను రిలీజ్ చేసుకుని ఎలాగోలా బండి నడిపించొచ్చు అని సినిమా వాళ్ళు బాగా నమ్మకంగా ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ నమ్మకం పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓటీటీ సంస్థలు ఏ కంటెంట్ పడితే.. ఆ కంటెంట్ ను తీసుకోవడం లేదు.
మ్యాటర్ ఉంటేనే.. పైగా ఆ మ్యాటర్ కి ప్యాడింగ్ ఉంటేనే ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి. లేదంటే తమ సంస్థ మెయిన్ గేట్ దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ఇవేమి అర్ధం చేసుకోలేని కొంతమంది డైరెక్టర్లు తమకు తోచింది రాసుకుని, ఆ కంటెంట్ ను షూట్ చేయడం కోసం అప్పులు చేసి మరీ అవుట్ ఫుట్ తీసుకువచ్చి చివరకూ నష్టపోతున్నారు. మరోపక్క మార్కెట్ లెక్కలు మరోలా ఉన్నాయి. ఈ మధ్య ఓటీటీ సంస్థలు కూడా తెలివి మీరిపోయాయి.
కంటెంట్ బాగున్నా.. హిట్ అవుతుందని నమ్మకం ఉన్నా.. ఎన్ని వ్యూస్ వస్తే అన్ని పైసలు అంటూ కొత్త లెక్కలు చూపిస్తూ ఉన్న లెక్కను కూడా మోసం చేస్తున్నాయి. ఈ మోసాల పరంపరలో చివరకు బలి అయ్యేది అమాయకంగా లేదా బ్లైండ్ గా సినిమాలు చేసే చిన్నాచితకా దర్శకనిర్మాతలే. దీనికితోడు ఈ మధ్య సమస్త బూతు వ్యవహారాన్ని తీసుకువచ్చి ఓటిటి ప్లాట్ ఫారమ్ లలో కుమ్మరిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ ల పేరిట వెర్రితలలు వేస్తున్న శృంగారాన్ని రంగరించి జనం మీదకు వదులుతున్నారు. ముఖ్యంగా హిందీ వెబ్ సిరీస్ లు గురించి అయితే వేరే చెప్పనక్కరలేదు. అక్రమ సంబంధాలు, విచ్చలవిడి శృంగారం తప్ప మరో పాయింట్ ఉండదు. ఇక్కడ మరో దరిద్రం కూడా ఉంది. ఒక్క ఓటిటి సంస్థల్లోనే కాదు, యూట్యూబ్ చానెళ్లల్లో కూడా విచ్చలవిడి శృంగార చిత్రాలు ఎక్కువైపోయాయి.
వీటికి యాభై, వంద అని టికెట్ రేట్లు కూడా పెడుతున్నారు. అయితే బోల్డ్ వెబ్ సిరీస్ లు చేసే చిన్న దర్శకనిర్మాతలకు ఓటిటీలు హ్యాండ్ ఇచ్చినా.. యూట్యూబ్ ఛానెల్స్ లో టికెట్ రేటు పెట్టి, పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవచ్చు. ఎంతైనా చిన్నాచితకా దర్శకనిర్మాతలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది.