లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే, ఈ జంట పెళ్లి పై పలుమార్లు పుకార్లు షికార్లు చేయడం బాగా అలవాటు అయిపోయింది. అయితే, ఆ పుకార్లను ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టకుండా ఈ జంట తమ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. నయనతార ప్రస్తుతం ‘నెత్రికన్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా రిలిక్ కి సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్ లో నయనతార పాల్గొంది.
ఈ సందర్భంగా నయనతార ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు నిశ్చితార్థమైందని అని సిగ్గు పడుతూ ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని కూడా చూపించింది. ఇక పనిలో పనిగా తనకు కాబోయే భర్త గారి పై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. ‘విఘ్నేశ్ మనసు చాలా మంచింది, తను ఎంతో మంచి వ్యక్తి. తనతో ఉంటే నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను’ అంటూ మొత్తానికి నయనతార తన లేటెస్ట్ ప్రేమ వ్యవహారం పై వివరణ ఇచ్చింది. ఇక నవంబర్ లో పెళ్లి ఉంటుందట.
కానీ, నయనతారకు పెళ్లి ఫిక్స్ అయిందని ఆమె అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఇన్నాళ్లు నయనతారను తమ కలల మహారాణిగా ఊహించుకున్న ఆమె అభిమాన సమూహం ఇప్పుడు డీలా పడింది. కాకపోతే, నయనతార సన్నిహితుల ఆనందానికి మాత్రం అవధుల్లేకుండా పోయాయి. ఎప్పటి నుంచో వాళ్ళు ఆమె పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి నయనతారను త్వరలోనే పెళ్లి కూతురిగా చూడబోతున్నాం అన్నమాట.
అయితే, లేడీ సూపర్ స్టార్ గా నయనతార, ఆ స్టార్ డమ్ ను ఎంతవరకు ఎంజాయ్ చేస్తుందో తెలియదు గానీ, తన స్టార్ డమ్ వల్ల.. ఆమె పై అనేక రూమర్స్ పుట్టాయి. ఓ దశలో ఆ పుకార్ల పరంపరకు నయనతారకు జీవితం పైనే విరక్తి కలిగిందట. తన వ్యక్తిగత జీవితంలోని ప్రేమ కథల గురించి కథలుకథలుగా రాయడం అసలు జీర్ణయించుకోలేకపోయింది. కానీ, విఘ్నేష్ శివన్ ఆమె జీవితంలోకి వచ్చాక, ఆమె ఆ పుకార్లను పట్టించుకోవడం మానేసింది.