Nawazuddin Siddiqui: ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయత, జాతీయవాదం పై చాలా వ్యవహారం నడిచింది. అసలు ఒక కళాకారుడికి అవి అవసరమా ? అసలు సినిమాకి ప్రాంతీయవాదం ఏమిటి ? ప్రాంతీయత విద్వేషాలు లేవనెత్తి భుజానికి ఎత్తుకోవడం ఎవరికీ మంచిది కాదు. అయినా ఈ డిజిటల్ జనరేషన్ లో ఓటీటీ సంస్కృతి వచ్చాక సినిమాకి భాషతో పని లేకుండా పోయింది. ఇలాంటి రోజుల్లో జాత్యాహంకారం దేనికి ? నిన్న ప్రకాష్ రాజ్. ఈ రోజు మరో జాతీయ స్థాయి నటుడు కూడా ఇదే విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు

హిందీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటే హిందీ ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా ‘సీరియస్ మెన్’ అనే సినిమాలో అద్భుతమైన నటన కనబర్చి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేషన్ పొందిన టాలెంట్ ఆయనది. అయితే తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నవాజ్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి కంటే ఎక్కువగా జాత్యాహంకారం ఉంది. అదే ఇక్కడ పెద్ద సమస్య. దీని గురించి పెద్దగా ఎవరూ మాట్లాడరు. మీకు తెలుసా ? బాలీవుడ్ లో నల్లగా ఉండేవారు హీరోయిన్లుగా రాణించలేరు. కారణం అవకాశాలు ఇవ్వరు. మంచి సినిమాలు రావాలంటే ఇలాంటి జాత్యాహంకారం ఉండకూడదు.
నేను చాలా సంవత్సరాలుగా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే నేను పొట్టిగా ఉంటాను కదా. అందుకే కొన్ని పాత్రలను నాకు ఇవ్వరు. అయినా నా పరిస్థితి బాగానే ఉంది, కాకపోతే, ఈ రకమైన జాత్యాహంకారం కారణంగా ఎందరో గొప్ప నటులు బలైపోయారు. జీవితంలో పైకి రాలేక నలిగిపోతున్నారు’ అంటూ నవాజుద్దీన్ సిద్ధిఖీ బాధ పడుతూ చెప్పారు.
ప్రపంచంలో ఏ భాషా చిత్రం బాగున్నా.. ఆ చిత్రాన్ని అన్ని భాషల వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాత్యాహంకారం, ప్రాంతీయవాదం పరిశ్రమలో రోజురోజుకు పెరుగుతూ పోతుండటం, పైగా కొందరు నటులు దానికి వత్తాసు పలకడం నిజంగా బాధాకరమైన విషయమే. ఆ వైపరీత్య మనస్తత్వం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు.