Natty Kumar: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అటు రాజకీయ వర్గాలతో పాటు చిత్ర పరిశ్రమలో వాడివేడి చర్చకు దారి తీసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టాలీవుడ్ ముక్తకంఠంతో ఖండించాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. దీన్ని సమర్థిస్తూ నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడారు. ఆయన కీలక కామెంట్స్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన ప్రభుత్వంలో కొందరు పెద్దలు పదవులు అనుభవించారు. అన్ని విధాలా టాలీవుడ్ కి అండగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఖండించాలని అంటున్నారు.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి వంటి స్టార్స్ బయటకు రావాలని, చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా గళం విప్పాలని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తే ఏమవుతుంది. సీఎం జగన్ ఏమైనా ఉరి తీస్తాడా? అని ఎద్దేవా చేశాడు. పరిశ్రమ ప్రముఖులే కాకుండా ఫిల్మ్ ఛాంబర్ కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. టాలీవుడ్ పెద్దలు కనీసం ఒక ట్వీట్ చేసినా చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే రాజకీయాల్లో చిత్ర పరిశ్రమ జోక్యం చేసుకోవచ్చా అనే వాదన కూడా ఉంది. నట్టి కుమార్ చిన్న నిర్మాత. ఆయన ఎప్పుడో ఒక సినిమా తీస్తారు. ఏం మాట్లాడినా ఆయనకు వచ్చిన నష్టం లేదు. స్టార్ హీరోలు, దర్శకులు చంద్రబాబు మద్దతు ప్రకటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. టాలీవుడ్ కి తెలుగు రాష్ట్రాలే ప్రధాన ఆదాయ వనరులు. అందులోనూ 60% శాతానికి పైగా రెవెన్యూ ఏపీ నుండి వస్తుంది. ఇక్కడ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడితే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నట్లే లెక్క.
నెక్స్ట్ అధికారం ఎవరిదనేది పక్కన పెడితే, ఏపీలో ఎన్నికలకు మరో 8-9 నెలల సమయం ఉంది. ఈ వ్యవధిలో సలార్, దేవర వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు మీడియం రేంజ్ చిత్రాల విడుదల ఉంది. చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకిస్తే ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం ఖాయం. గతంలో ఇలాంటి పరిణామాలు జరిగాయి. అధికారం చేపట్టిన జగన్ ని టాలీవుడ్ అభినందించలేదని ఆయన టికెట్స్ ధరల మీద ఉక్కుపాదం మోపాడు. చర్చలకు పరిశ్రమ పెద్దలు తన వద్దకు వచ్చేలా చేసుకున్నాడు.
కాబట్టి చంద్రబాబుపై అభిమానం ఉన్నా లేకున్నా పరిశ్రమ ప్రముఖులు ఆయన అరెస్ట్ ఖండించడం ప్రయోజనాలను దెబ్బతీసే అంశం. హీరోలు రాజకీయాల్లో తలదూర్చడం వలన ఒక వర్గం వ్యతిరేకతకు గురికావాల్సి వస్తుంది. అభిమానుల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. చంద్రబాబు వ్యవహారం పై మాట్లాడిన ఏ హీరో అయినా టీడీపీ సానుభూతిపరుడనే మార్క్ వేసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రతి హీరో, చిత్ర ప్రముఖుడు వ్యక్తిగతంగా అభిమానించే పార్టీలు, నాయకులూ ఉంటారు. కాబట్టి నట్టి కుమార్ డిమాండ్ అసంబద్ధం. ప్రతి ఒక్కరూ బయటపడి చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకించాలని కోరడం సరికాదని పలువురి వాదన. అది చిత్ర పరిశ్రమకు కూడా మంచిది కాదని విశ్లేషకుల అభిప్రాయం.