మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల లొల్లి మళ్లీ రాజుకుంది. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ ఎంట్రీతో ఈ వివాదం రాజుకుంది. అనంతరం మంచు విష్ణు దీనికి ప్రతిగా పోటీకి దిగడంతో వాతావరణం వేడెక్కింది. మరో ఇద్దరు ముగ్గురు కూడా బరిలో నిలవడంతో ఈ వార్ పతాక స్థాయికి చేరింది.
ఇక ప్రకాష్ రాజ్ పోటీపై నాన్ లోకల్ అంటూ పలువురు తెరపైకి తీసుకురావడం.. దానికి ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాబోయే ఎన్నికలపై కూడా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ హాట్ కామెంట్స్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
రాబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు తెలుపుతానో ఇంకా నిర్ణయించుకోలేదని.. ప్రస్తుత అధ్యక్ష స్థానంలో ఉండటంతో దానిపై స్పందించడం సరికాదని సీనియర్ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.
‘మా’ మసకబారింది అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు నరేశ్ కౌంటర్ ఇచ్చారు. నాగబాబు వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. మా గురించి చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవచ్చని నియమ నిబంధనల్లో ఉంది. ‘మా’పై వ్యాఖ్యలు చేసే వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని నరేశ్ స్ఫష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసినా తాను మంచి మెజార్టీతో గెలుస్తానని నరేశ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తాను పోటీచేయనని.. యువరక్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఏకగ్రీవం చేస్తే గొంతు నులిమేసినట్లేనన్న నాగబాబు వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని.. ఏకగ్రీవం కోసం హీరో ‘విష్ణు’ చేసిన ప్రతిపాదన అభినందీయమన్నారు. ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్టు ఉంటుందని నాగబాబు మాత్రమే చెప్పారని.. చిరంజీవి సపోర్ట్ ఎవరికనేదానిపై పెద్దాయన స్పందించలేదు కదా అని అన్నారు.