హీరో అనిపించుకోవడానికి ‘నాని’ దాదాపు ఎనిమిదేళ్లు కష్టపడాల్సి వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా అష్టకష్టాలు పడితే.. లక్కీగా హీరో అయ్యాడు. ఎంతైనా కింద నుండి వచ్చిన వాడు కాబట్టి.. అందుకే వచ్చిన స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడానికి నానాకష్టాలు పడుతున్నాడు. తప్పు లేదు, అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా చేసేది అదే. కాకపోతే.. ప్రస్తుతం కరోనా ప్రళయంలో కూడా.. నాని తన కక్కుర్తిని వదిలిపెట్టడం లేదంటూ సినీ జనాలే కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే.. నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంది. అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేకుండా పడి ఉంది.
మరోపక్క రోజురోజుకూ కొవిడ్ సెకండ్ వేవ్ ఉప్పెనలా ఎటాక్ చేస్తోన్నా.. నాని తన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ కి మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఒకపక్క ఈ సినిమా సెట్ లో కరోనా కేసులు నమోదు అయినా.. నాని మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ఈ సినిమాను ఈ నెలాఖరుకు ఫినిష్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. పైగా ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకొంది కాబట్టి.. ఇంకో ఇరవై రోజుల్లో సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారు కాబట్టి.. ఎలాగూ ఒప్పుకున్న సినిమా కాబట్టి, నానికి తప్పలేదు అని సరిపెట్టుకోవచ్చు. కానీ అంతలో మూడో సినిమాని కూడా మొదలుపెట్టాడు. నాని ఇలా మరింతగా తొందరపడడం విచిత్రంగా ఉంది.
నాని ఒప్పుకున్న సినిమాల లిస్ట్ లో ‘అంటే సుందరానికి’ అనే సినిమా కూడా ఒకటి. నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైపోయింది. నజ్రియా ఈ రోజు హైదరాబాద్ కి వచ్చి షూటింగ్ లో పాల్గొంది. అసలు కరోనా టైంలో నాని ఎందుకింత తొందర పడుతున్నాడు? ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నాడు ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నా.. నాని మాత్రం పట్టించుకునే మూడ్ లో లేడు. ఎట్టిపరిస్థితుల్లో మరో మూడు నెలల్లో ఈ సినిమాని కూడా పూర్తి చేయాలని నాని ఫిక్స్ అయ్యాడట. మరి నాని తొందర వల్ల ఎవరికీ కరోనా సోకుతుందో మరి.