Hi Nanna Glimpse Review: జయాపజయాలు ఎలా ఉన్నా… హీరో నాని భిన్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. గ్యాంగ్ లీడర్, వి, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ, దసరా చిత్రాల కథలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రతి సినిమాకు కొత్తదనం ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆయన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ఎంచుకున్నారు. నాని 30వ చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ నిర్ణయించారు. నేడు హాయ్ నాన్న ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. నిమిషానికి పైగా ఉన్న ప్రోమో సినిమాపై ఆసక్తి రేపింది.
నూతన దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్న మూవీ తెరకెక్కించారు. హాయ్ నాన్న ప్రోమో పరిశీలిస్తే… ఇది తండ్రీ కూతుళ్ళ ఎమోషనల్ జర్నీ. వీరి బంధానికి స్నేహం అనే మరో కొత్త కోణం అందమైన అమ్మాయి రూపంలో జతైతే ఆ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అదే హాయ్ నాన్న. హీరో నాని కూతురు ఫ్రెండ్ గా మృణాల్ ఠాగూర్ నటిస్తుంది. డాడీ, డాటర్, ఫ్రెండ్ పాత్రల నేపథ్యంలో హాయ్ నాన్న సాగనుంది.
ఆ చిన్నారి కారణంగా కలిసిన నాని, మృణాల్ ఎమోషనల్ జర్నీ సినిమాకు ప్రధాన బలమని అర్థమవుతుంది. మా నాన్న అని నానిని కూతురు పరిచయం చేయగా, హీరోయిన్ హాయ్ నాన్న అని పరిచయం చేసుకోవడం కొత్తగా ఉంది. నాని తన ట్వీట్ లో సైతం ఆమె(మృణాల్) నన్ను నాన్న అని పిలుస్తుందని కామెంట్ చేశాడు. హాయ్ నాన్న ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు పెంచేసింది.
ఇక చకచకా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన నాని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ ఏడాది మార్చిలో ఆయన దసరా మూవీతో ప్రేక్షకులను పలకరించారు. డిసెంబర్ 21న హాయ్ నాన్న విడుదల కానుంది. 2023లో నాని రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక క్లీన్ హిట్ లేక అల్లాడిపోతున్న నానికి దసరా ఉపశమనం కలిగించింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయం నమోదు చేసింది. హాయ్ నాన్నతో నాని సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు.
