Nagarjuna: రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తుంటారు. పైగా నేటి కాలంలో సోషల్ మీడియా విపరీతమైన యాక్టివ్ గా ఉంది. అలాంటప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట జనాల్లోకి అత్యంత సూటిగా వెళుతుంది.. వారు చేసే విమర్శ నుంచి మొదలుపెడితే ఆరోపణ వరకు ప్రతిదీ కూడా అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఇలాంటప్పుడు నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోపణ నుంచి మొదలు పెడితే విమర్శ వరకు సాధ్యమైనంత వరకు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.
కానీ ఈ విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కాస్త దూకుడుగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది.. నాగార్జున కుమారుడు నాగచైతన్య, అతని మొదటి భార్య సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ సంచలన వ్యక్తులు చేశారు. వారిద్దరు విడాకులు తీసుకోవడానికి గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన కేటీఆర్ కారణమని ఆరోపించారు. సహజంగా ఇలాంటి మాటలను వేరే వారు మాట్లాడితే పెద్దగా లెక్కలోకి తీసుకునేవారు కాదు. కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేయడం.. పైగా ఆమె తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన శాఖను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచింది. దీనికి తోడు కొండా సురేగా చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ మీడియా, ఆ పార్టీ అనుబంధ సోషల్ మీడియా గ్రూపులు, యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ప్రభుత్వానికి తీవ్రమైన తలనొప్పిని తీసుకొచ్చాయి. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది నటులు కూడా కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం కాస్త ఉపద్రవంలాగా మారింది. ఈ క్రమంలో నాగార్జున కొండా సురేఖ మీద పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో కొండా సురేఖ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా రెండు రోజుల క్రితం అర్ధరాత్రి నాగార్జునకు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. తను మాట్లాడిన మాటలకు నాగార్జున గారి మనసు బాధపడితే క్షమించాలని కోరారు.
ఈ క్రమంలో నాగార్జున సురేఖ మీద దాఖలు చేసిన పరువు నష్టం కేసును వెనక్కి తీసుకున్నారు.. నాగార్జున కేసును వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కేసుకు సంబంధించిన దస్త్రాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో ఒక్కసారిగా వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇటీవల తన ఓ ఎస్ డి వ్యవహారంలో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కూడా కొండా సురేఖ ముఖ్యమంత్రి కి క్షమాపణలు చెప్పడం విశేషం.