Shaheen Sayeed: ఢిల్లీ నగరంలో కారులో బాంబు పేలుడు చోటు చేసుకోవడం.. దానికంటే కొంతమంది ఉగ్రవాదుల ఆచూకీ లభించడం.. వంటి ఘటనలు చోటుచేసుకున్న తర్వాత… నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో మరింత మంది ఉగ్రవాదుల లింకు లభ్యమైంది. దీంతో వారందరినీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. తమదైన శైలిలో విచారిస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఓ లేడీ డాక్టర్ వ్యవహారం.
పైకి చూస్తే శాంతమూర్తి లాగా.. సేవా తత్పరురాలిలాగా కనిపించేది ఆల్ ఫలహ్ యూనివర్సిటీలో పనిచేసే డాక్టర్ షహీన్. పైగా ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేది. రోగుల పట్ల దొంగ ప్రేమను ప్రదర్శించేది. రోగులకు సేవ చేయడానికి మాత్రమే తనను భగవంతుడు పుట్టించినట్టు చెప్పుకునేది. అంతేకాదు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు.. రోగుల సేవలో తరిస్తున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేది. ఎప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి.. షహీన్ గురించి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిందో.. అప్పుడే ఆమె లీలలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షహీన్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత.. విచారణ మొదలు పెట్టిన తర్వాత అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
షహీన్ కు పుల్వామా ఎటాక్ మాస్టర్ మైండ్ ఉమర్ ఫరూక్ భార్య అఫీరాతో సంబంధాలు ఉన్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల దర్యాప్తులో తేలింది. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహిన్ ను సంప్రదించారు. భారతదేశంలో జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి.. అందులోకి మహిళలను రిక్రూట్ చేయాలని సూచించారు. 2019లో జరిగిన ఎన్కౌంటర్లో ఉమర్ చనిపోయాడు. ఉమర్ చనిపోయిన నాటి నుంచి అతని భార్య అఫీరా భారత్ మీద తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయేది. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసేది.. అందువల్లే ఈ స్థాయిలో ఉగ్ర కార్యకాల పాలకు శ్రీకారం చుట్టింది. అయితే తొలిసారి మహిళలను ఇందులోకి దింపి.. ఘోరాలకు పాల్పడేలా శిక్షణ ఇచ్చింది. ఎప్పుడైతే ఈ ఉగ్ర మాడ్యూల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతికి చిక్కిందో.. అప్పటినుంచి వీరి ఆటలకు బ్రేక్ పడింది.
మహిళా ఉగ్రవాదులకు వివిధ ఖాతాల ద్వారా డబ్బులు పంపేవారని తెలుస్తోంది. అయితే ఈ నగదు మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చేదని తెలుస్తోంది. పూర్తి హవాలా మార్గంలో డబ్బులు తరలించేవారని.. కొంతమంది వ్యక్తులు ఈ డబ్బులు పంపిణీ చేసేవారని సమాచారం.. వారి లావాదేవీల మీద కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దృష్టి సారించారని.. మరి కొద్ది రోజుల్లో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.