
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. ఎప్పటికప్పుడు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు సైతం ఇస్తుంటారు. అయితే.. ఇటీవల ఓ నెటిజన్ అడిగిన వింతైన ప్రశ్నకు.. వింతగా రిప్లై ఇచ్చాడు నాగబాబు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలో పూర్తిస్థాయిలో అవగాహనకు రాక.. ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మెగాబ్రదర్‌ను ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం దేవుడిలా ఆదుకున్నారు.
ఇటీవల నాగబాబు కూతురు నిహారిక పెళ్లి జరిగింది. ఇక తన కొడుకు వరుణ్ వివాహంపై ఇప్పుడు నెటిజన్లు నాగబాబును ప్రశ్నిస్తున్నారు. తమకు కులమతాల పట్టింపుల్లేవని.. వరుణ్‌తేజ్ ఎవరిని పెళ్లిచేసుకున్నా అభ్యంతరం లేదంటూ నాగబాబు తన మనసులో మాటను ఇదివరకే ప్రకటించారు. అయితే.. తాజాగా ఓ నెటిజన్ ఇదే అంశాన్ని లేవనెత్తాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లైవ్‌లో నాగబాబు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మాట్లాడుతూ.. ‘వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేచ్ చేస్తార సార్. జోడీ బాగుంటుంది’ అని కామెంట్ చేశాడు. ఏకంగా ఫలానా హీరోయిన్‌తో అని నెటిజన్ ప్రస్తావించడంతో నాగబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ క్షణంలో జాతిరత్నాలు సినిమాలోని ఓ సీన్ ఆయన మనసులో మెరుపులా మెరిసింది. ఆ సినిమాలోని క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేసి నెటిజన్‌కు రీషాకిచ్చారు.
ఆ కోర్టు సీన్‌లో జడ్జిగా ఉన్న బ్రహ్మీ ‘తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా.. ఇక నేనెందుకు..? ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే’ అనే డైలాగ్ ఉంటుంది. ఇక అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు ఆ డైలాగ్ విసరడంతో కొసమెరుపు. నాగబాబు ఫన్నీ రిప్లై సోషల్ మీడిమాలో వైరల్ అయింది. మొత్తానికి నాగబాబును బ్రహ్మానందం ఆదుకోకపోతే … ఆయన పరిస్థితి ఏంటో అనే సరదా కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.