Nagababu : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, కొన్ని కోట్లాది మంది ప్రజలకు ఆదర్శప్రాయంగా నిల్చిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా ఏమి చెప్తాము చెప్పండి?, ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. అయితే ఒక మనిషి అంతలా ఎదగడానికి కచ్చితంగా స్ఫూర్తిని ఇచ్చేవారు కొంతమంది ఉంటారు. చిరంజీవి కి అలా స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి తన తండ్రి వెంకట్రావు. హెడ్ కానిస్టేబుల్ గా కెరీర్ ని మొదలు పెట్టి ఆ రోజుల్లోనే 5 మంది పిల్లలను పోషించడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే రీసెంట్ గానే ఫాథర్స్ డే సందర్భంగా తన తండ్రి గురించి నాగబాబు(Nagababu Konidela) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తన తండ్రితో తమకు ఉన్న బంధం గురించి, ఆయనతో గడిపిన మధుర క్షణాల గురించి నాగబాబు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న గారికి చాలా కోపం ఎక్కువ. పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన్ని చూస్తే మాకు చాలా భయం వేసేది. డ్యూటీ చేసి ఇంటికి తిరిగి రాగానే ఆయన మోటార్ బైక్ శబ్దం విని మేము హడలిపోయేవాళ్ళం. ఆయనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. భోజనం చేసేటప్పుడు ఆయనకు కావాల్సినవి లేకపోతే కోపం తెచ్చుకునేవాడు. ఎన్నో సందర్భాల్లో మా నాన్న నన్ను కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఒక తండ్రి ఎన్ని ఇబ్బందులు పడుతాడు అనేది మేము తండ్రి అయ్యినప్పుడే మాకు తెలిసొచ్చింది. నాకు చిన్నప్పటి నుండి నాన్న అంటే భయం కాబట్టి నేను ఆయనతో కలివిడిగా ఉండేవాడిని కాదు. అంత కష్టపడి పని చేసి వచ్చిన వాడిని అన్నం తిన్నావా నాన్న, ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రేమగా ఒక్కరోజు కూడా మాట్లాడేవాడిని కాదు. ఆ బాధ నాలో ఇప్పటికీ ఉంది’.
‘వయస్సు వచ్చిన తర్వాత నాన్న మాతో ఉన్నప్పుడు బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళం కానీ, ఇలాంటివి అడిగేవాళ్ళం కాదు. మీరు కూడా మీ తల్లితండ్రులతో ప్రేమగా ఉండడం నేర్చుకోండి. ఎప్పుడైనా వాళ్ళ దగ్గరకు వెళ్లి, ప్రేమగా హత్తుకొని మాట్లాడండి. ఇందిరా కొత్తగా ప్రవర్తిస్తున్నావ్ అని వాళ్ళు కచ్చితంగా అంటారు. కానీ లోపల మాత్రం ఎంతో ఆనందపడుతారు. ఆ ఆనందాన్ని వాళ్లకు దూరం చేయకండి. మా నాన్న పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు కానీ,మనిషి ఎంతో గొప్పవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఏడ్చేస్తాడు. తన దగ్గరున్న డబ్బులు మొత్తం వాళ్లకు ఇచ్చేస్తుంటాడు. మా నాన్న మనస్తత్వానికి జిరాక్స్ కాపీ మా పవన్ కళ్యాణ్. వాడికి కూడా మా నాన్న లాగానే ధైర్యంతో ముందుకు వెళ్లే స్వభవం ఉంది. నలుగురికి సహాయం చేసే తత్త్వం వచ్చింది. ఆ లక్షణం మా అందరికి ఉంది కానీ,మా తమ్ముడు మాత్రం మా నాన్న కి జిరాక్స్ కాపీ లాగా ఉంటాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.