Mythri Movie Makers: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. ప్రతుతం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మైత్రి బ్యానర్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో లతో సినిమాలను నిర్మిస్తుంది. కాగా త్వరలోనే మైత్రి నిర్మాణంలో నిర్మిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17 న రిలీజ్ కానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుక్కు – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మొదటిసారిగా అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు.

ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. కాగా గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అంతే కాకుండా ఈ స్టార్ కాంబోను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని అని కూడా వార్తలు తెగ వినిపించాయి. నిన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ లో ఈ వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలయ్య కలిసి నటించే మల్టీ స్టారర్ సినిమా అవకాశం వస్తే ఎవరూ వదులుకుంటారని అన్నారు. అయితే వీరు చేసిన వ్యాఖ్యలతో సినిమా తెరకెక్కనుందనే వార్తలు మరింత బలపడ్డాయి. మరి నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.