Music Director Bheems: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొత్త డైరెక్టర్స్ ని అత్యధికంగా పరిచయం చేసిన హీరోల లిస్ట్ తీస్తే అందులో మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) కచ్చితంగా ఉంటాడు. బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతోమంది టాప్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత రవితేజ సొంతం. కేవలం డైరెక్టర్స్ ని మాత్రమే కాదు, ఇతర డిపార్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళను కూడా ఆయన ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. అలా రవితేజ కారణంగా ఇండస్ట్రీ లో నేడు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న వ్యక్తి భీమ్స్ సిసిరోలియో(Bheems Ceceralio). ‘ధమాకా’ చిత్రం తో ఆయన కెరీర్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది. రవితేజ చేసిన సహాయం గురించి నిన్న ‘మాస్ జాతర'(Mass Jathara Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్స్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఒక రోజు నా కుటుంబాన్ని చూపిస్తూ, బాధతో ఒక వీడియో ని చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాను. ఏ విషయాన్నీ అయినా పాట ద్వారా తెలపడం నాకు అలవాటు. అలా ఈ వీడియో ని తీశాను. కానీ ఆ వీడియో లో ఉన్న నా భార్యాపిల్లలకు నేను ఎందుకు ఆ వీడియో ని తీస్తున్నానో తెలియదు. ఇంటికి అద్దె ఎలా కట్టాలి, పిల్లని ఎలా చదివించాలి, అసలు ఎలా బ్రతకాలి అనే బాధతో ఆ వీడియో ని తీసాను. ఆ సమయం లోనే నాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి ఫోన్ వచ్చింది. మీరు ఆఫీస్ కి రావాలని చెప్పారు, వెళ్లాను. ఆరోజు ఆ ఒక్క ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. ఆ ఫోన్ రాకముందు నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ భూమి మీద బ్రతికేందుకు నాకు హక్కు లేదు, నాకు, నా భార్యాపిల్లలకు భవిష్యత్తు కనిపించడం లేదు, అందరం కలిసి చనిపోదాం అనే స్టేజి కి వెళ్ళిపోయాను’.
‘ఆ సమయం లోనే నేను కొలిచే దేవుడు రవితేజ రూపం లో వచ్చాడు. నేను ఈరోజు ఈ స్థానం లో నిల్చొని ఉన్నాను అంటే అందుకు కారణం రవితేజ గారే. ఆయన లాంటి గొప్ప మనుషులు ఉంటేనే ఇండస్ట్రీ లోకి నాలాంటి వాళ్ళు వస్తుంటారు’ అంటూ భీమ్స్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు. భీమ్స్ కి ‘ధమాకా’ చిత్రం మొదటి సినిమా కాదు, అంతకు ముందే ఆయన చాలా సినిమాలు చేసాడు. కానీ ఒక్క సినిమా కూడా ఆయనకు గుర్తింపుని తీసుకొని రాలేదు. పని చేసిన సినిమాలకు సరిగా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేవారు కాదేమో. ఇండస్ట్రీ లో కొత్తవాళ్లకు ఎదురయ్యే పరిస్థితులే ఇవి. అందుకే భీమ్స్ ఆర్థికంగా అంతలా చితికిపోయి, కుటుంబం తో కలిసి చనిపోవాలి అనే నిర్ణయం తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
