Murari Re Release: టాలీవుడ్ లో ఇప్పుడు మనమంతా చూస్తున్న రీ రిలీజ్ ట్రెండ్ కి ఆజ్యం పోసిన వారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘పోకిరి’ సినిమాతో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసేలా చేస్తుంది. వాస్తవానికి పోకిరి కి ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలలో గబ్బర్ సింగ్ చిత్రాన్ని వేసుకున్నారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, ఆ ఆలోచనకి పదును పెడుతూ పోకిరి చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. అది సక్సెస్ అవ్వడం తో జల్సా సినిమా రీ రిలీజ్ ఇంకా గ్రాండ్ గా సక్సెస్ అయ్యి రీ రిలీజ్ ట్రెండ్ ని తారా స్థాయికి తీసుకెళ్లింది.
అయితే ఈమధ్య కాలం లో కాస్త ఈ ట్రెండ్ తగ్గింది అని ట్రేడ్ పండితులు భావించారు. కానీ ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మురారి’ చిత్రంతో మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ కి ఊపిరి పోశారు. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి అభిమానులు సైతం అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి మూడు రోజులకు కలిపి 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం ఆల్ టైం రికార్డు గా ఉండేది. ఈ సినిమాకి ఫుల్ రన్ లో దాదాపుగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డు, మురారి చిత్రం తో బ్రేక్ అయ్యింది. ‘కల్కి’ చిత్రం తర్వాత టాలీవుడ్ లో విడుదలైన ఏ సినిమా కూడా థియేటర్స్ కి ఆదాయం తీసుకొని రాలేదు. కానీ మురారి చిత్రం రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి ఈ స్థాయి వసూళ్లను రాబట్టింది అంటే సాధారమైన విషయం కాదు.
ఆగష్టు 15 వ తారీఖు వరకు ఏ సినిమా లేకపోవడం తో ఈ చిత్రానికి అప్పటి వరకు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఫుల్ రన్ లో 8 నుండి 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రికార్డు ని వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల అవ్వబోతున్న గబ్బర్ సింగ్ తో మొదటి రోజునే అధిగమిస్తామని పవన్ కళ్యాణ్ అభిమానులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో గబ్బర్ సింగ్ మేనియా మొదలైంది. మరి ఈ చిత్రం మురారి ని మరపిస్తుందా లేదా అనేది చూడాలి.