Pasupuleti Kannamba: పసుపులేటి కన్నాంబ.. ఒక కంట సెంటిమెంట్ తో ప్రేక్షకుల చేత కంట కన్నీరు పెట్టించడం, మరో కంట కోపాన్ని ప్రదర్శించి చండ్రనిప్పులు కురిపించి ఔరా అనిపించడం యావత్ భారత్ దేశ చలనచిత్ర చరిత్రలో ఒక్క ‘కన్నాంబ’కు మాత్రమే సాధ్యం. ఆమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మన తొలితరం వెండితెర కథానాయక. కన్నాంబకి నటన ఏమి పుట్టుకతో రాలేదు. ఆకలి అరుపుల నుంచి ఆ నటనా చాతుర్యం పుట్టింది. చిన్న వయసులోనే పొట్టకూటి కోసం నాటకాల్లో నటించింది.

ఆ రోజుల్లో ఓ ఆడపిల్ల నాటకాలు వేస్తుంది అంటే.. బజారు మనిషిగా భావించే రోజులు అవి. కన్నాంబ గారు ఆ కట్టుబాటు తెగింపులను చీల్చి బయటకు వచ్చింది. ఎన్నో అపవాదులు తన పై రుద్దుతున్నా ఆమె ఆ కాలాన్ని ఎదిరించింది. మగాళ్లకు పోటీగా నాటకాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను కష్టాలను భరించింది. దానికి తోడు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు ఆమెను బాగా ఇబ్బంది పెట్టేవి.
అప్పట్లో వినుకొండలో ఓ నాటకం వేస్తున్నారు. ఆ నాటకం అయిపోయాక, ఓ వ్యక్తి కన్నాంబ దగ్గర వచ్చి.. ‘మీ నాటకాలకు నేను తరుచూ వస్తుంటాను. ఒక్కో నాటకంలో ఒక్కోలా మీరు అద్భుతంగా నటిస్తారు. కానీ ఎందుకు, అన్నీ నాటకాల్లోనూ ఒకే చీరను ధరిస్తున్నారు ?. ఆ మాటకు కన్నాంబ ఓ కంట బాధ పడుతూనే, మరో కంట చిలిపిగా చూసి ‘నాటకాల కోసం చాలా కథలున్నాయి. కానీ, నాకు వేసుకోవడానికి ఒక చీర మాత్రమే ఉంది’ అంది. ఆమె మాటకు అతను బాధగా చూస్తూ ఉండిపోయాడు.
Also Read: తొలి తెలుగు హీరోయిన్ స్టేజ్ పైనే జన్మించింది !
తన నటనతో అందర్నీ ఏడిపించే ఆ తొలి మహానటి జీవితంలోని ఆర్ధిక లోతులు అతనికే కాదు, చాలామందికి తెలియదు. ఎందుకంటే.. పేదరికంలోనూ కన్నాంబ గారు గొప్పగా కనిపించేవారు. ఆమె కష్టాలను కూడా ఇష్టంగా చేసుకుని బతికారు. అలా ఎన్నో కష్టాలు పడి, ‘హరిశ్చంద్రా’ చిత్రంతో 1935లో సినీ రంగప్రవేశం చేశారు. నాటి నుంచి 1964లో వచ్చిన చివరి చిత్రం ‘వివాహ బంధాం’ వరకూ కన్నాంబకి తిరుగులేకుండా పోయింది.
కన్నాంబ ముందు నటించేటప్పుడు ఎస్వీయార్, ఎన్టీఆర్ లు కూడా జాగ్రత్తపడేవారు. ఆమె ముందు బాగా నటించకపోతే, ఆమె నటన ముందు ఇక ఎవ్వరూ నిలబడలేరు. సినిమాల వల్ల కన్నాంబ కాదు, కన్నాంబ వల్ల సినిమాలే బాగు పడ్డాయి. పైగా సూపర్ స్టార్ గా వెలుగొందిన నిజమైన స్టార్ ఆమె. అప్పటి స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటి కూడా ఆమె. తన విశిష్ట నటనతో, విలక్షణ సంభాషణ పటిమతో తెలుగు, తమిళ వెండితెరల పై శాశ్వతంగా నిలిచి పోయింది.
Also Read: హీరోయిన్‌కు కరోనా.. చనిపోవాలంటూ కామెంట్స్..!