నటీనటులుః పవన్ కల్యాణ్, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, నివేదాథామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు
దర్శకత్వంః శ్రీరామ్ వేణు
నిర్మాతలుః దిల్ రాజు, బోనీకపూర్
సంగీతంః థమన్
రిలీజ్ డేట్ః 09 ఏప్రిల్, 2021
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పరిచయమై పాతిక సంవత్సరాలు అవుతోంది. ఏడాదికి ఒక్కటి అన్నట్టుగా పాతిక సినిమాల్లో నటించారు. వకీల్ సాబ్ 26వ సినిమా. ఆయన మూవీస్ లిస్టు చూస్తే.. దాదాపు సగం వరకు ఫ్లాప్ సినిమాలే కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఆయన స్టార్ డమ్ మాత్రం ప్రతీ సినిమాకు పైకి ఎగబాకుతూనే వెళ్లింది. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన రేంజ్ ఎవరెస్టును తాకింది. 2001లో వచ్చిన ఖుషీ తర్వాత మధ్యలో జల్సాను మినహాయిస్తే.. 2012 వరకు పవన్ అభిమానులను ఉర్రూతలూగించే హిట్ కరువైంది. పదేళ్లపాటు ఆయన సక్సెస్ ను అందుకోకపోయినప్పటికీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. అభిమానుల గుండెల్లో ఆయన స్థానం పెరిగిందే తప్ప ఇసుక రేణువంత కూడా తగ్గలేదు.
పవన్ విషయంలో ఎవ్వరికీ అంతు చిక్కని విషయం ఇదే. వరుసగా రెండు సినిమాలు ఢమాల్ అంటే.. స్టార్ డమ్ పాతాళానికి పడిపోయే చోట.. వైఫల్యాలతో సంబంధం లేకుండా పవన్ రేంజ్ మాత్రమే ఎలా పైకి ఎగబాకుతోందో ఎవ్వరికీ అర్థం కాని పజిల్. ఇందులో ఆయన వ్యక్తిత్వానికి అగ్రతాంబూలం అంటారు కొందరు. అందుకే కాబోలు.. పవన్ కు అభిమానులు ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారని అంటుంటారు. అభిమానులందు పవర్ స్టార్ అభిమానులు వేరయా అంటుంటారు. అలాంటి తమ హీరో రాజకీయాల్లోకి వెళ్లి, ఇక సినిమాలు చేసే అవకాశం లేదని నిరాశకు, నిర్వేదానికి గురవుతున్న వేళ.. ‘పవన్ ఈజ్ బ్యాక్’ వచ్చిన మూవీ వకీల్ సాబ్. సాధారణ సమయాల్లోనే పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి మూడేళ్ల గ్యాప్ తర్వాత రాబోతుండడంతో.. అంచనాలు ఎవరెస్టు అంచులను తాకుతున్నాయి. మరి, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూద్దాం.
కథః
అంజలి-నివేదా థామస్-అనన్య ముగ్గురూ స్నేహితులు. ఒకరోజు రాత్రి తాగి వచ్చిన విలన్ గ్యాంగ్ నడుచుకుంటూ వెళ్తున్న వారిపై అత్యాచారం చేసేందుకు యత్నిస్తారు. తీవ్రభయాందోళనకు గురైన బాధితులు.. పోలీసుల వద్దకు పరిగెడతారు. నిందితులకు సమాజంలో చాలా పలుకుబడి ఉంటుంది. ఇటు చూస్తే.. బాధితులు సాధారణ యువతులు. దీంతో.. పోలీసులు నిందితుల పక్షమే నిలుస్తారు. న్యాయం ఎండమావిగా మారిపోయిన చోట.. ఏ దిక్కూ లేని అభాగ్యుల పక్షాన.. తాను ఉన్నానంటూ వస్తాడు వకీల్ సాబ్. బలమైన లాయర్ ను, బలవంతమైన నిందితులను ఢీకొని.. అభాగ్యులకు వకీల్ సాబ్ ఎలా న్యాయం చేశాడన్నదే సినిమా కథ.
పెర్ఫార్మెన్స్ః
లాయర్ గా పవన్ కల్యాణ్ నటన తారస్థాయిలో ఉంది. అన్యాయాన్ని ఎదిరించే వకీల్ సాబ్ గా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు పవర్ స్టార్. బాధిత యువతులుగా అంజలి, నివేదా థామస్, అనన్య అద్భుతంగా నటించారు. చేష్టలుగిన అభాగ్యుల పాత్రల్లో ఒదిగిపోయారు. క్రిమినల్ లాయర్ గా ప్రకాష్ చెలరేగిపోయారు. పవన్ ప్రేయసిగా శృతిహాసన్ ఆకట్టుకుంది. మొత్తం అందరూ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
విశ్లేషణః
వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ అన్నది తెలిసిందే. ఆ సినిమా మేజర్ గా ముగ్గురు యువతుల చుట్టూనే తిరుగుతుంది. లాయర్ పాత్రలో అమితాబ్ తక్కువ సమయమే సినిమాలో కనిపిస్తారు. కానీ.. ఈ సినిమాను పవర్ స్టార్ చేయాల్సి రావడంతో మార్పులు అనివార్యం అయ్యాయి. అది కూడా పవన్ రీ-ఎంట్రీ మూవీ కావడంతో అభిమానులు ఆశించే అంశాలు తప్పనిసరి అయ్యాయి. దీంతో.. క్లాసిక్ మూవీని కమర్షియల్ చేస్తున్నారా? అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ.. ముందు నుంచీ చెబుతున్నట్టుగానే మూలాన్ని టచ్ చేయకుండా కథ అల్లుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. దీంతో.. కథలో భావోద్వేగాన్ని కొనసాగిస్తూనే.. పవన్ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. తద్వారా అన్నివైపులా న్యాయం చేశాడు.
ఎక్కువ భాగం కోర్టు రూమ్ లోనే సాగిపోయే సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. థమన్ స్వరపరిచిన పాటలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. మగువా మగువా సాంగ్ చిత్రీకరణ కూడా అద్బుతంగా సాగింది. అయితే.. పవన్ గత చిత్రాల మాదిరిగా వినోదం ఆశించే అవకాశం లేదు. హాస్యానికి కూడా స్కోప్ లేకపోవడం వల్ల వాటిని ఆశించే వారికి కాస్త నిరాశ కలిగించొచ్చు. ఓవరాల్ గా వకీల్ సాబ్ సినిమాతో పవన్ గ్రాండ్ విక్టరీతో రీ-ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు.
బలాబలాలుః కథ, పవన్ నటన, సంగీతం
బలహీనతలుః వినోదం పాళ్లు తక్కువ
లాస్ట్ లైన్ః దిగ్విజయంగా కేసు గెలిచిన వకీల్ సాబ్
oktelugu.com రేటింగ్ః 3/5