అది ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. రాజకీయాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. మరోపక్క బాలయ్య బాబు సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. పరిస్థితి ఎన్టీఆర్ కి అర్ధమైంది. ఇలాగే ఈ ప్లాప్ ల పరంపర కొనసాగితే.. బాలయ్యకి వచ్చిన స్టార్ డమ్ పోతుందని.. ఇక ఎన్టీఆరే రంగంలోకి దిగారు. బాలయ్యతో తానే ఒక సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు.
కట్ చేస్తే.. వరుస సక్సెస్ లు ఇస్తున్న దర్శకుడు కోదండరామిరెడ్డి గురించి ఎన్టీఆర్ అడిగారు. అప్పుడు చిరంజీవి సినిమా సెట్ లో షాట్ బిజీలో ఉన్న కోదండరామిరెడ్డికి సీఎం ఎన్టీఆర్ గారి నుండి ఫోన్ వచ్చిందని మేనేజర్ వచ్చి చెప్పారు. ఫోన్ లో ‘బాలకృష్ణతో ఎన్టీఆర్ గారు మీ చేత సినిమా చేయించాలనుకుంటున్నారు. మరి మీకు దర్శకత్వం వహించడం ఇష్టమేనా.
పెద్దాయన (ఎన్టీఆర్) మిమ్మల్ని అడగమన్నారు. మీకు ఇష్టమైతే ఒకసారి వచ్చి ఎన్టీఆర్ గారిని కలవండి’ అంటూ రామకృష్ణా స్టూడియోస్ నుంచి బాలకృష్ణ మేనేజర్ ఫోన్ లో క్లుప్తంగా విషయం చెప్పేశాడు. కోదండరామిరెడ్డి మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చి ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కలిశారు. తెల్లారి నాలుగున్నరకు అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఇంటి వరండాలో కోదండరామిరెడ్డి ఎదురుచూస్తూ ఉన్నారు.
ఎన్టీఆర్ బయటకు వచ్చి కోదండరామిరెడ్డిని చూసి ఆప్యాయంగా పలకరించారు. కాసేపు మాట్లాడి.. బాలయ్య కోసం మంచి కథను మీరే ఎంపిక చేయండి అంటూ పూర్తి బాధ్యతను కోదండరామిరెడ్డి మీదే పెట్టారు. కథ రెడీ అయింది. ఎన్టీఆర్ గారికి చెప్పాలి. దాంతో సినిమా చర్చల నిమిత్తం రోజూ కోదండరామిరెడ్డి అబిడ్స్ లో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాల్సి వచ్చేది.
అయితే అక్కడకి వెళ్లేసరికి అప్ప్పటికే ఎంతో మంది అధికారులు, మంత్రులు ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. కానీ ఎన్టీఆర్ మాత్రం, ముందుగా కోదండరామిరెడ్డి అండ్ అతని టీమ్ నే పిలిచి మాట్లాడేవారు. వాళ్ళు గదిలోకి వెళ్లగానే సీఎం పదవిలో ఉండి కూడా ఎన్టీఆర్ గౌరవంగా లేచి నిలబడి ‘‘రండి బ్రదర్’’ అని వాళ్ళను ఆహ్వానించేవారట. ఒక రాష్ట్రానికి అధినేత ఒక సినిమా దర్శకుడికి ఇచ్చిన గౌరవం అది.