Most Eligible Bachelor Review: అక్కినేని ఫ్యామిలీ.. ఇండస్ట్రీలోని మెయిన్ పిల్లర్లలో ఒకటి.. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అంతే ఠీవీగా నిలబెట్టాడు నాగార్జున. టాలీవుడ్ లోని నలుగురు మూలస్తంభాల్లో ఒకడిగా నిలిచాడు. అయితే ఆయన తర్వాత మాత్రం ఆ కుటుంబం నుంచి వారసత్వం సరిగ్గా లాంచ్ కావడం లేదు. ఇప్పటికీ నాగచైతన్య, అఖిల్ లు ఒక సినిమా హిట్ మరో రెండు మూడు ఫ్లాపులతో కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా అఖిల్ అయితే ఒక్క భారీ హిట్ కోసం చకోరా పక్షిలా తిరుగుతూనే ఉన్నాడు. నటుడిగా మంచి మార్కులు కొట్టేసినా ఇప్పటికీ హిట్ అతడి ఖాతాలో పడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఫేడ్ అవుట్ అయిన ‘బొమ్మరిల్లు’ దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీని తీశాడు. సీనియర్ హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి రోమాన్స్ చేసిన ఈ మూవీ ఈ దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా?
Most-Eligible-Bachelor-Review
-కథ:
అఖిల్ (హర్ష అనే పాత్రలో) ఒక ప్రవాస భారతీయుడు. అమెరికాలో జీవిస్తుంటాడు. 20 రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. పెళ్లి చూపుల కోసం చాలా మంది అమ్మాయిలను చూసినా పెద్దగా ఇష్టపడడు. ఆ సమయంలో పూజా హెగ్డే (విభ)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడుతాడు. కానీ ఆమె మాత్రం హర్షను దూరం పెడుతుంది. విభ పెళ్లికి ఓకే చెప్పదు. ఆమె ఎందుకు వివాహాన్ని వ్యతిరేకించింది. సినిమా మొత్తం కథ ఏంటి? హర్ష ఎందుకు ఆమె కోసం తపనపడ్డాడు.. ఊహించని అడ్డంకులను ఎలా అధిగమించాడు.. హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే అసలు సినిమా కథ.
-విశ్లేషణ
‘బొమ్మరిల్లు’ లాంటి గ్రాండ్ హిట్ తర్వాత ‘ఆరెంజ్’ తీసి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు భాస్కర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని తీసిన ప్రేమకథా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అఖిల్ పెళ్లి కోసం తపనపడే తీరును తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా పెళ్లి చూపులు సన్నివేశాలు చాలా కామెడీగా సాగి అలరించాయి. ఈషరెబ్బ, ఫరియా, మరో వర్ధమాన నటీనటులతో సాగిన పెళ్లి చూపులు ఎపిసోడ్లు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. పూజా హెగ్డే, అఖిల్ మధ్య కామెడీ ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. సినిమాలో పోసాని కోర్టు సీన్లు అలరిస్తాయి. హీరో హీరోయిన్ మధ్య లవ్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ కాలం అమ్మాయిలు , అబ్బాయిలు పెళ్లిళ్ల విషయంలో ఎలా కలలు కంటారు.? వారి ఊహలు, ఊసులు చక్కగా చూపించారు. బ్యాచ్ లర్ జీవితం, కుటుంబం విలువలు కాపాడుకునే యువకుడి పాత్రలో అఖిల్ జీవించేశాడు. ఫస్టాఫ్ కామెడీతో ఆకట్టుకోగా.. ఇంటర్వెల్ ముందు మంచి టర్నింగ్ పాయింట్ పెట్టేశాడు. సెకండాఫ్ సీరియస్ మోడ్ లోకి వెళ్లి పూజా కోసం అఖిల్ పడే కష్టాలు.. అక్కడక్కడ కొద్దిగా బోరింగ్ సీన్లతో క్లైమాక్స్ వరకూ తీసుకెళ్లి చివరలో మాత్రం అద్భుతంగా ఆవిష్కరించాడు.
ఒక్క హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అఖిల్ ఈ సినిమాలో విశ్వరూపమే చూపించాడు. బ్యాచ్ లర్ పాత్రలో నటిస్తూ ఎన్.ఆర్ఐ ఎలా ఉంటాడో చూపించాడు. కామెడీ, సెంటిమెంట్, రోమాన్స్ లో ఇరగదీశాడు. పూజా హెగ్డే పాత్రకు జీవం పోసింది. సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పోసాని , రాహుల్ రవీంద్రన్, చిన్మయి పాత్రల్లో ఒదిగిపోయారు.
క్లైమాక్స్ సీన్లు బాగా పండించారు. దర్శకుడు భాస్కర్ స్క్రీన్ ప్లేపై బాగా కసరత్తు చేసి చూపించాడు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. గోపిసుందర్ సంగీతం హైలెట్ గా నిలిచింది. కొన్ని చిన్న చిన్న లోపాలు తప్పితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ’ మూవీ హిట్ అని చెప్పొచ్చు. ఫరవాలేదనేలా ఉంది.
-ప్లస్ పాయింట్స్
-అఖిల్ నటన
-పూజా హెగ్డే
-క్లైమాక్స్ సీన్స్
-మైనస్ పాయింట్స్
-సెకండ్ ఆఫ్ కొన్ని బోర్ సీన్లు
-ఊహించే కథాంశం
చివరగా..: అఖిల్ ‘బ్యాచ్ లర్’ కష్టాలకు తెరపై బాగానే పడింది..
-oktelugu.com రేటింగ్: 2.5 /5