ప్రస్తుతం టాలీవుడ్లో ఇబ్బడిముబ్బడిగా తెరకెక్కుతున్న రీమేక్ సినిమాలను చూస్తే.. పొరుగింటి పుల్లకూర అంటే మన టాలీవుడ్ పరిశ్రమకు ఎంత రుచో అర్థం అవుతోంది. ఇప్పటికే టాలీవుడ్ ను పరభాష నటులతో నిండిపోయింది. తెలుగు సినిమాలో ఒక్క హీరో.. ఇద్దరు ముగ్గురు తెలుగు నటీనటులు మినహా మిగతావారంతా వారే ఉంటారు. ఇక హీరోయిన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. అసలు తెలుగమ్మాయిలకు టాలెంట్, గ్లామర్ లేదన్నట్లు ఇండస్ట్రీ చూస్తోంది. ఏదో చెప్పుకోవడానికి ఒకరిద్దరు మినహా పెద్దగా తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చిన పాపానా టాలీవుడ్ ఇండస్ట్రీ పోలేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో..!
Also Read: కల తీరకుండానే జయప్రకాశ్ రెడ్డి కనుమూశారు
ఇప్పటికే పరభాష నటులతో కంపుకొడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ.. ప్రస్తుతం రీమేకులకు డంప్ యార్డుగా మారింది. లోకల్ టాలెంట్ ఏమాత్రం గుర్తించకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అందరు ఇప్పుడు ఒకటే మంత్రం జపిస్తున్నారు. అదే రీమేక్ మంత్రం.. పరాయి భాషలో హిట్టయిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకులు, నిర్మాతలు, హీరోలు పోటీపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
టాలీవుడ్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలను పరిశీలిస్తే దాదాపు అన్ని సినిమాలు కూడా రీమేకులే కన్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ రీమేక్ గా వస్తోంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’.. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘లూసీఫర్’.. ‘వేదలమ్’.. సినిమా మలయాళం, తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన సినిమాలే. అదేవిధంగా తమన్నా-సత్యదేవ్ జంటగా తెరకెక్కుతున్న ‘గుర్తిందిగా శీతాకాలం’.. నిర్మాత రాంచరణ్ కొనుగోలు చేసిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీలన్నీ కూడా రీమేక్ చిత్రాలే.
ఈ చిత్రాలను తెలుగు నెటివిటీకీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. పోటాపోటీగా రీమేక్ సినిమాలు తెలుగులో వస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ రీమేక్ ల డంప్ యార్డుగా మారిందా? అనే సందేహం కలుగుతోంది. తెలుగులో కంటెంట్ అందించేవారే కరువయ్యా? అన్న ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ రాకతో ఇటీవలీ కాలంలో మంచి కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో యంగ్ స్టర్స్ తీసే షార్ట్ ఫిలిమ్స్ అన్నీ ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని పొందుతూ ఎన్నో అవార్డులను.. రివార్డులను అందుకొని సత్తాచాటాయి.
Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకల్ టాలెంట్ ను గుర్తించకపోవడంతో తెలుగులో రీమేకుల హవా కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నారు. కరోనా ప్రస్తుతం ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కోట్లు ఖర్చుపెట్టి పరభాష చిత్రాలను కొనుగోలు చేసి రీమేక్ చేసే బదులుగా లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీకే మంచి జరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టాలీవుడ్ లోకల్ టాలెంట్ గుర్తిస్తుందా? లేదా పొరుగుంటి పుల్లకూర రుచి అన్న చందంగా వ్యవహరిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే..!