Mohan Babu Comments On Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్.. ఈ కంపెనీ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులను విక్రయిస్తూ ఉంటుంది. ఈ కంపెనీ చిన్న సంస్థగా ప్రారంభమై.. వేలాదిమందికి ఉపాధి కల్పించే వ్యవస్థగా రూపాంతరం చెందింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ, అధికారంలో లేకపోయినప్పటికీ హెరిటేజ్ సంస్థ వేగవంతమైన కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. ప్రకృతి విపత్తుల వల్ల విపత్కర పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా హెరిటేజ్ సంస్థ సహాయ సహకారాలు చేస్తూ ఉంటుంది.
హెరిటేజ్ సంస్థకు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అధినేత్రిగా ఉన్నారు. భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణి మిగతా హోదాలో కొనసాగుతున్నారు. పాల ఉత్పత్తులను తయారు చేయడం మాత్రమే కాకుండా.. పాలను సంస్థకు అందించే రైతులకు కూడా హెరిటేజ్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు.. పాల సేకరణ తర్వాత బోనస్ అందిస్తూ ఉంటుంది. హెరిటేజ్ సంస్థ అంటే రైతులకు విపరీతమైన మమకారం ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, ఇతర రాష్ట్రాలలో కూడా హెరిటేజ్ సంస్థ రైతులకు ఇదేవిధంగా తోడ్పాటు అందిస్తూ ఉంది.
హెరిటేజ్ సంస్థకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో సీనియర్ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? అనే విషయాలపై క్లారిటీ లేదు. కాకపోతే హెరిటేజ్ సంస్థ పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ తనదని.. అందులో మెజారిటీ షేర్లు, పెట్టుబడి తనకే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు దానిని బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఇంటర్వ్యూలో మోహన్ బాబు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ప్రకారం అప్పుడు ఆయన వైసిపి లో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే చంద్రబాబు మీద ఈ స్థాయిలో విమర్శలు చేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ నూతన అవసరాల కోసం ఎలాగైనా వ్యవహరించే మోహన్ బాబు.. చంద్రబాబు మీద విమర్శలు చేయడం కొత్తేమీ కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.