ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ కష్టాలు ఎదుర్కొంటోంది. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో సినీ పరిశ్రమ ఇబ్బందుల పాలవుతోంది. థియేటర్లు మూసివేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిశ్రమకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

కానీ ఏపీలో మాత్రం పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ టికెట్ల రేట్లు పెంచుకోవద్దని హెచ్చరికలు జారీ చేయడం, సదుపాయాలు సరిగా లేవనే సాకుతో దాడులు చేయడంతో పలువురు యజమానులు థియేటర్లకు తాళాలు వేసుకుంటున్నారు. దీంతో పరిశ్రమ బతికి బట్టకట్టే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలతో చిరంజీవి భేటీ అవుతారనే వార్తలు వస్తున్నాయి. మంత్రి పేర్నేని నానితో కలిసి సీఎం జగన్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వీరి కలయికకు ముహూర్తం కూడా కుదిరిందని సమాచారం. దీంతో సినిమా కష్టాలు తీర్చేందుకు చిరంజీవి నడుం కట్టినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ స్టెప్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
సినీ పరిశ్రమ గత కొద్ది రోజలుగా నష్టాల బాటలోనే పయనిస్తోంది. ప్రభుత్వ నిర్వాకంతో పరిశ్రమ కోలుకోవడం లేదు. దీంతో సినీ పరిశ్రమ కష్టాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో చిరంజీవి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో సమస్యను కొలిక్కి తెచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ తీసుకుంటున్న చర్యలతో సినీ పరిశ్రమ గాడిన పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.