Mega star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి వచ్చే సినిమాలు బాక్సాఫీసు వద్ద కలక్షన్ల సునామీనే సృష్టిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆచార్య సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతుండగా.. గాడ్‌ఫాదర్ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంత బిజీ షెడ్యూల్లోనూ మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు చిరు.

తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమా సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే సినిమా రీమేక్‌గా మెహర్ రమేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోంది. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చనున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం మహతి పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు ప్రకటించి అభిమానుల్లో జోషు పెంచింది.
ఇందులో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముందని, పాటలు, నేపథ్య సంగీతం మరోలెవెల్లో ఉంటాయని చిత్ర బృందం తెలియజేసింది. ఇందులో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషించనున్నారు. చిరుకు జోడీగా కాజల్, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.