
కరోనా సెకండ్ వేవ్ గోల గనక లేకుంటే.. థియేటర్ లు మోతెక్కిపోయేవి. బడా సినిమాలను ఆస్వాదిస్తూ.. సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేసేవాళ్లు ఆడియన్స్. కానీ.. కొవిడ్ మహమ్మారి వరుసగా రెండో సీజన్ ను కూడా మింగేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రేక్షకుల ఆకలిని మరోసారి ఓటీటీలే తీర్చాయని చెప్పాలి. మే నెలలో వారానికి ఒక సినిమా చొప్పున మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి, ఇవి ప్రేక్షకులను ఏ విధంగా అలరించాయో చూద్దాం.
మొదటగా అనసూయ లీడ్ రోల్ లో నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం వచ్చింది. మే 7వ తేదీన ఈ మూవీ ‘ఆహా’లో రిలీజ్ అయ్యింది. ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పించలేకపోయిందనే చెప్పాలి. కథలో ఉద్వేగం సరైన విధంగా పండకపోవడంతో.. ఈ మూవీని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు.
ఈ చిత్రం తర్వాత వచ్చిన మరో మూవీ ‘సినిమా బండి’. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఎలాంటి స్టార్లు లేకున్నా.. అద్భుతమైన వినోదం పండించడంతో ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు ఆడియన్స్. సినిమా సక్సెస్ కావాలంటే.. స్టార్లు ఖచ్చితంగా ఉండాల్సిన పనిలేదు, సరైన కథ, కథనం ఉంటే చాలని నిరూపించిన సినిమా ఇది. ఒక్క తెలిసిన ముఖం కూడా లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది.
ఇక, ఆ తర్వాత జీ-5లో వచ్చిన మూవీ ‘బట్టల రామస్వామి బయోపిక్’ కామెడీ ప్రధానాంశంగా వచ్చిన ఈ చిత్రం కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇందులోనూ స్టార్లు ఎవ్వరూ లేకపోవడం విశేషం. అయినప్పటికీ.. మంచి విజయం సాధించింది. ఇక, ఈ మూవీ తర్వాత వచ్చిన మరో చిత్రం ‘ఏక్ మినీ కథ’. ఇది మొత్తం బోల్డ్ కంటెంట్ ను డిస్కస్ చేసిన మూవీ. మొదట్నుంచీ ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫామే సరైందనే అభిప్రాయం వినిపించింది. థియేటర్లు ఓపెన్ అయ్యుంటే నిర్మాతలు ఏం చేసేవారోకానీ.. ఆ ఛాన్స్ లేకపోవడం ఓటీటీలో వదిలారు. చూసిన తర్వాత అందరూ ఓటీటీ రిలీజే బెస్ట్ అన్నారు. మిగిలిన ఆడియన్స్ కాస్త ఇబ్బంది పడొచ్చేమోగానీ.. యూత్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ తర్వాత్ వచ్చిన ఆఖరి చిత్రం ‘అనుకోని అతిథి’. ఇది కూడా ఆహాలో విడులైంది. సాయిపల్లవి, సాజిద్ వంటి స్టార్లతో వచ్చిన ఈ థ్రిల్లర్ కూడా జనాలను ఆకట్టుకోలేకపోయింది. దీంతో.. మేలో రెండు చిత్రాలను విడుదల చేసిన ఆహా సంస్థ.. హిట్ కొట్టలేకపోయింది. మొత్తానికి ఓటీటీల ద్వారా ఆడియన్స్ కు మాత్రం మంచి వినోదం లభించిందని చెప్పొచ్చు.
కాగా.. కరోనా కండీషన్ చూస్తే.. జూన్ లోనూ పూర్తిగా పరిస్థితులు కుదుటపడేట్టు కనిపించట్లేదు. సెకండ్ వేవ్ తగ్గుతున్నా.. థర్డ్ వేవ్ వార్తలు భయపెడుతున్నాయి. కాబట్టి.. జూన్ లోనూ పలు సినిమాలు ఓటీటీనే ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయట. మరి, ఈ నెలలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాల్సి ఉంది.