Bollywood Celebrities
Bollywood Celebrities: ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుల దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఇలా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు రావడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు రాజ్ పాల్ యాదవ్, రెమో డిసౌజా లకు ఈ హత్యా బెదిరింపులు వచ్చినట్లు సోషల్ మీడియా మాధ్యమాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సెలబ్రిటీలకు విష్ణు అనే వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పలు ఆంగ్ల మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం మెయిల్ లో ” మేము మీ ప్రతి కదలికను గమనిస్తున్నాము. ఇది పబ్లిక్ స్టంట్ కాదు, మిమ్మల్ని వేధించడం కోసం చేసే ప్రయత్నం కూడా కాదు. మీరు ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకోండి” అంటూ రాసి ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అలాగే నిందితుడు ఎనిమిది గంటల్లో తన డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు కూడా వార్తల్లో వినిపిస్తుంది. అయితే ఇప్పటివరకు మెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లు ఏంటో వెల్లడించలేదు. ఇలా వస్తున్న బెదిరింపులపై రాజు పాల్ యాదవ్ భార్య అంబోలి పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు నిందితుడి నుంచి బెదిరింపులు వచ్చినట్లు బయటపడింది. కేసు నమోదు చేసుకున్న అంబోలి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే దుండగుల దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు.
కొన్ని రోజులపాటు సైఫా అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో మంగళవారం రోజు డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దుండగులు సైఫ్ అలీ ఖాన్ ను అతడి ఇంట్లోనే దాడి చేశారు. ముంబై నగరంలో బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు షరీఫ్ ఫుల్ ఇస్లాం షహజాద్ చోరీకి ప్రయత్నం చేశాడు. అతనిని ప్రతిఘటించేందుకు సైఫ్ అలీ ఖాన్ ప్రయత్నించడంతో దుండగుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. ఈ క్రమంలో గాయపడిన సైఫ్ గట్టిగా అరవడంతో దుండగుడు వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో ఇంట్లో కార్లు అందుబాటులో లేకపోవడంతో పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సైఫ్ ను ఒక ఆటోలో లీలావతి తీసుకెళ్లాడు.
ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రానా. ఆ సమయంలో ఆటో డ్రైవర్ కు తన ఆటోలో ఎక్కింది నటుడు సైఫ్ అలీ ఖాన్ అని తెలియదు. లీలావతి ఆసుపత్రిలో దిగిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ కు తన ఆటో ఎక్కింది సైఫ్ అలీ ఖాన్ అని తెలిసింది. దాంతో అతను చార్జి కూడా తీసుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయిన తర్వాత అదే ఆసుపత్రిలో తనను కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా ను కలిశాడు. ఐదు నిమిషాలు ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడి అతనిని కౌగిలించుకొని ధన్యవాదాలు తెలిపాడు సైఫ్. భజన్ సింగ్ సకాలంలో స్పందించి సైఫ్ అలీ ఖాన్ ను కాపాడడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో అతనికి ప్రశంసలు వెల్లువెత్తాయి.